రామాయంపేట/ చేగుంట, జూలై 30: వర్షం పడితే ఆ పాఠశాలలోని విద్యార్థులు నిలబడే విద్యాభ్యాసం చేయాల్సి వస్తు న్నది. జోరుగా వర్షం కురిస్తే ఆ బడి భవనం ఊరుస్తుంది. దీంతో ఆ విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే. చినుకుపడితే పాఠశాల అంతా చిత్తడే. ఐదు తరగతులు, ఐదుగురు టీచర్లు, 130 మంది విద్యార్థులు. ఐదు గదుల్లోనూ వర్షపు నీరు పారుతుంది. విద్యార్థులు చదువుకోవాలంటే బెంచీల ముందు నిలబడాలి. లేదా బేంచీలు ఎక్కి కూర్చోవాలి.
ఇది మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితి. మూడేండ్ల్లుగా కొనసాగుతూనే ఉంది. వర్షపు నీళ్లు పైన పడకుండా ప్లాస్టిక్ బకెట్లు, బేసిన్లు పెట్టి విద్యాబోధన చేయాల్సి వస్తున్నది. టీచర్లు ఈ విషయమై విద్యా శాఖ అధికారులకు ఏటా విన్నవించినా పరిష్కారం మాత్రం లభించడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే అక్కడ చదివే విద్యార్థులు, ఉపాధ్యాయులకు నరకప్రాయంగా మారుతున్నది.
నార్సింగిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విషయంలో కలెక్టర్ ప్రతిమాసింగ్ దృష్టికి తీసుకెళ్లాం. సంబంధిత అధికారితో విచారణ చేపట్టి త్వరలోనే మరమ్మతులు చేయిస్తాం. విద్యార్థులకు పాఠశాల గదుల మూలంగా ఇబ్బందులు కలుగకుండా నాణ్యమైన విద్యను అందిస్తాం.
– గంగాబాయి, ఎంఈవో, నార్సింగి