చేగుంట/ రామాయంపేట రూరల్/ పెద్దశంకరంపేట/ చిలిపిచెడ్/ మెదక్ మున్సిపాలిటీ/ చిన్నశంకరంపేట/ కౌడిపల్లి, జనవరి 6 : అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. చేగుంట ఎంపీపీ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి శనివారం పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రరెడ్డి, డీపీవో సాయిబాబా, జిల్లా వైద్యాధికారి చందూనాయక్, మండల ప్రత్యేకాధికారి జమ్లా నాయక్, తహసీల్దార్ గియాఉన్నీసాబేగం, ఎంపీడీవో ఆనంద్‌మేరీ పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డులు అందించాలి
రామాయంపేట మండలంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి వెంటనే అందజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజాపాలన ముగుస్తున్నందున భారీగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు వచ్చారు. కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు ఫారాలు వచ్చాయని అందులోనే వివరాలు నింపి ఇవ్వాలని అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా జనం ఎగబడ్డారు.
ప్రజాపాలన దరఖాస్తులపై డీఎఫ్‌వో సమీక్ష
పెద్దశంకరంపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో డీఎఫ్‌వో రవిప్రసాద్ పంచాయతీ కార్యదర్శులు, డాటాఎంట్రీ ఆపరేటర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఆపరేటర్లు క్షుణ్ణంగా పరిశీలించి, ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయాలన్నారు. ఆయనతో తహసీల్దార్ గ్రేసీబాయి, ఎంపీడీవో రఫీకున్నీసా, ఆర్ఐ శరనప్ప ఉన్నారు.
పొరపాట్లు లేకుండా ఆన్లైన్ చేయాలి
ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి, పొరపాట్లు లేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు తహసీల్దార్ ముసాద్దిక్, మండల ప్రత్యేకాధికారి కృష్ణయ్య సూచించారు. శనివారం నుంచి ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. నమోదును తహసీల్దార్, మండల ప్రత్యేకాధికారి పరిశీలించారు. దరఖాస్త్తుదారుల ఆధార్, రేషన్‌కార్డు, మొబైల్ నంబర్లతోపాటు ఇచ్చిన సమాచారాన్ని అప్లోడ్ చేయాలన్నారు. వారితో ఫైజాబాద్ గ్రామ కార్యదర్శి నాగరాజు, మండల ఏఎస్వో వెంకటేశ్వం, సిబ్బంది ఉన్నారు.
జిల్లాలో ముగిసిన ప్రజాపాలన
డిసెంబర్ 29న ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం శనివారంతో ముగిసింది. మెదక్ జిల్లా కేంద్రంలోని 29, 31, 32వ వార్డుల్లో కౌన్సిలర్లు బొద్దుల రుక్మిణి, శ్రీనివాస్, మానసతో కలిసి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జానకీరామ్‌సాగర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో..
చిన్నశంకరంపేట మండలకేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎంపీడీవో ప్రవీణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్పం చ్ రాజిరెడ్డితో కలిసి అధికారులు ప్రజ ల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
నేటి నుంచి 17 వరకు కంప్యూటరీకరణ
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను నేటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు కంప్యూటరీకరణ చేస్తామని డీఈవో రాధాకిషన్ తెలిపారు. కౌడిపల్లి మండలంలోని షేరి తండాలో శనివారం ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ రాజునాయక్, డీఈవో రాధాకిషన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కౌడిపల్లి మండలంలో 11,900 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. నేటినుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులను డాటా ఎంట్రీ చేస్తామన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, వెటర్నరీ డాక్టర్ రాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, పీఆర్ఏఈ ప్రభాకర్, ఏపీఎం సంగమేశ్వర్, ఉప సర్పంచ్ స్వరూపాబాయి, పంచాయతీ కార్యదర్శి ఇర్షత్, హెల్త్ సూపర్వైజర్ రమేశ్, ఎంఎల్‌హెచ్‌పీ దేవకృప, ఏఎన్ఎంలు రాజమణి, మాజిద్ పాల్గొన్నారు.