హత్నూర, సెప్టెంబర్ 6: సంగారెడ్డి జిల్లా హ త్నూర మండలం దౌల్తాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. 10 జనవరి 2023 అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి రూ.కోటి 56లక్షలు మంజూరు చేయించి దవాఖాన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. శంకుస్థాపన చేసిన వెంటనే పనులు చురు గ్గా కొనసాగాయి. బీఆర్ఎస్ హయాంలోనే పనులు పూర్తయ్యాయి.
దీంతో భవనం ప్రారంభించే తరుణంలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ప్రారంభం నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా దవాఖాన నూ తన భవనం ప్రారంభించ లేదు. దీంతో శిథిల భవనంలోనే వైద్యసేవలు కొనసాగిస్తున్నారు. ఇదీ వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ సొంత జిల్లాలో పరిస్థితి. ఇప్పటికైనా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించి మెరుగైన వైద్యసేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.
దౌల్తాబాద్ ప్రభుత్వ దవాఖాన భవనం పూర్తి గా శిథిలావస్థకు చేరుకుంది. దీంతో భవనం పైకప్పు పెచ్చులూడుతున్నది. అంతేకాకుండా చిన్నపాటి వర్షానికే వర్షపునీరు గదుల్లోకి వస్తుంది. దవాఖానలో మందులు నిల్వ ఉం చే గదులుసైతం కురుస్తుండటంతో మందుల ప్యాకెట్లు తడిసిపోతున్నాయి.
నిత్యం దవాఖానకు పదుల సంఖ్యలో వచ్చేరోగులకు వైద్యసేవలు అందించడానికి ఇబ్బందిగా మారింది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు స్లైన్బాటిళ్లు ఎక్కించాలంటే వర్షం కురుస్తున్న గదుల్లోనే చికిత్స చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. శిథిల భవనంలో వైద్యసేవలు పొందడానికి భయపడుతూ కొంద రు ప్రైవేట్ దవాఖానలకు వెళ్తున్నారు.
భయంతో విధులు నిర్వహించాల్సి వస్తుందని వైద్యసిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం గోడలకు పగుళ్లు ఏర్పడి స్లాబు పెచ్చులూడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపునీటితో గదులన్నీ అపరిశుభ్రంగా మారి క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి. మందులు భద్రపర్చడానికి ఇబ్బందిగా మారింది.
దవాఖాన భవనం పూర్తిగా శిథిలావస్థకుచేరింది. గోడలకు పగుళ్లు ఏర్పడడంతోపాటు పైకప్పు పెచ్చులూడటంతో భయమేస్తోంది. వైద్యంకోసం వస్తే ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన కలుగుతుంది. దవాఖానలోనే ఉండి వైద్యం చేయించుకోవాలంటే ఇక ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన భవనం ప్రారంభించి దవాఖానను అక్కడికి మార్చాలి.
-చంద్రకళ, కాసాల, సంగారెడ్డి జిల్లా
లక్షల రూపాయలతో నిర్మించిన నూతన దవాఖాన భవ నం ఎందుకు ప్రారంభిస్తలేరో తెలుస్తలేదు. దౌల్తాబాద్ దవాఖానకు పరిసర గ్రామాల ప్రజలు ఎంతోమంది వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పుడు దవాఖానకు రావడానికి భయపడుతున్నారు. గోడలన్నీ పగుళ్లు ఏర్పడి స్లాబు పెచ్చులూడి వర్షపునీటితో అపరిశుభ్రంగా మారిం ది. వైద్యం చేయించుకోవాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
-అమృత, దౌల్తాబాద్, సంగారెడ్డి జిల్లా
నూతన భవనం ప్రారంభించాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లా. గదుల్లో వర్షపునీరు చేరి వైద్యం చేయడానికి ఇబ్బందిగా మారింది. గోడలకు పగుళ్లు ఏర్పడి క్రిమికీటకాలు సంచరిస్తున్నాయి. దవాఖానలో మందులు నిల్వ ఉంచడానికి ఇబ్బందులు పడుతున్నాం. వర్షానికి బెడ్లు తడిసి స్లైన్ ఎక్కించాలంటే ఇక్కట్లు తప్పడం లేదు.
– దివ్యజ్యోతి, వైద్యురాలు, దౌల్తాబాద్
శిథిల భవనంలో విధులు నిర్వహించాలంటే భయమేస్తోంది. ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని వైద్య సిబ్బంది భయపడుతున్నారు. చీమలు, క్రిమికీటకాలతో దవాఖానలో తిరగలేకపోతున్నాం. వర్షపునీటితో గదుల్లో దుర్గంధం వెదజల్లుతోంది. దవాఖానకు వచ్చే మందులు వర్షానికి తడిసిపోతున్నాయి. అధికారులు వెంటనే కొత్త భవనంలోకి మార్చాలి.
– జగదీశ్స్వామి, ఫార్మాసిస్టు, దౌల్తాబాద్