నర్సాపూర్, జూన్ 22: రోడ్ల పక్కన తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ వెజ్,నాన్‌వెజ్ మార్కెట్ మంజూరు చేసింది. ఇందుకోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 5 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు చకచకా కొనసాగాయి. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా ఒక్క ఇటుక నిర్మాణం కూడా జరగలేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తి నిర్మాణం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పలువురు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.
నర్సాపూర్ పట్టణంలో ప్రతి శుక్ర, మంగళవారాల్లో వారాంతపు సంత రెండు రోజులు పోలీస్‌స్టేషన్‌ను ఆనుకొని ఉన్న మూడు రోడ్లపైనే కొనసాగుతున్నది. ప్రతిరోజూ వ్యాపారం చేసేవారి కోసం నూతనంగా పాత తహసీల్ కార్యాలయం ఉన్న స్థలంలో రూ. 5 కోట్లతో జీప్లస్ వన్‌గా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిధుల కొరత వల్ల మధ్యలోనే ఆగిపోయింది. స్లాబ్, గోడలు నిర్మించారు. కూరగాయలు, ఇతర వ్యాపారం కోసం చిన్నచిన్న గదుల చొప్పున 36 స్టాళ్లు నిర్మించి వదిలేశారు. నాన్‌వెజ్ మార్కెట్ కోసం వెనుకాల పుటింగ్ వేసి వదిలేశారు. దీంతో అక్కడ పిచ్చిమొక్కలు మొలిచి పనిముట్లు తుప్పుపట్టిపోతున్నాయి. బిల్లులు రాకపోవడం వల్ల పనులు చేపట్టడం లేదని స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయాలని వ్యాపారస్తులు కోరుతున్నారు.
బిల్లులు రాక పనులు ఆగిపోయాయి. రెండు సంవత్సరాల క్రితమే బిల్లులు రికార్డు చేసి ప్రభుత్వానికి పంపినా ఇంత వరకు రాలేదు. రూ.80 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. అయితే రెండు కోట్లతో ప్రారంభమైన వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం ఆరున్నర కోట్లకు రివైజ్ చేయించాం.
– కిష్ణయ్య, నర్సాపూర్ మున్సిపల్ ఇంజినీర్, మెదక్ జిల్లా