దుబ్బాక,మే30: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కార్యక్రమాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన హాజరయ్యారు. మొదట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 150 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కారులో అన్నదాతలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కొనుగోళ్ల నుంచి ధాన్యం విక్రయించే వరకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రజా సమస్యలను పక్కనబెట్టి కాంగ్రెస్ నాయకులు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గ్రామాల్లో జీలుగ విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభ్వుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం తడిసి మొలకెత్తినా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ వ్యవసాయరంగాన్ని పండుగలా మార్చితే , కాంగ్రెస్ ప్రభుత్వం దండగలా చేసిందని మండిపడ్డారు. జిల్లాలో ఇన్చార్జి మంత్రి అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం దురదృష్టకరమన్నారు.
వర్షాకాలం ప్రారంభమైనా సీజనల్ వ్యాధులపై దృష్టిపెట్టడం లేదని, దవాఖానల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లేకపోవడంతో ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. అనంతరం అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్‌లో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ పూజలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పాలొన్నారు.
దుబ్బాకలో పలువురి వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎనగుర్తిలో మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. దుబ్బాక వంద పడకల దవాఖానలో దంత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూపరింటెండెంట్ హేమరాజ్‌కు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి ,కొత్త కిషన్‌రెడ్డి , కైలాశ్, కృష్ణ, శ్రీనివాస్, వంశీ, స్వామి పాల్గొన్నారు.