హుస్నాబాద్, జనవరి 8: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించ తలపెట్టిన వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. నిధులు మంజూరై దాదాపు రెండేండ్లకు వస్తున్నా పనులు మాత్రం పిల్లర్ల వరకే పరిమితం అయ్యాయి. ఏడాది కాలంగా కనీసం ఇసుమంత పనికూడా ముందుకు సాగకపోవడం గమనార్హం. సరిపడా నిధులున్నా అధికారులు, కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో భవన నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
దీంతో కూరగాయలు, చికెట్, మటన్ విక్రయించే వ్యాపారులు, రైతులు ప్రధాన రహదారులపై దుకాణాలు పెట్టుకొని విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం అంగడి వచ్చిందంటే పట్టణంలోని రహదారులన్నీ కూరగాయల దుకాణాలతో నిం డిపోతాయి. కూరగాయలు పండించే రైతులు కూడా అడ్డా లేకపోవడంతో స్థానిక దుకాణాదారులను బతిమిలాడి దుకాణాల ఎదుట కూరగాయలు పెట్టి అమ్ముకుంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావడం, స్వయంగా క్యాబినెట్ మంత్రి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ భవన నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హుస్నాబాద్ పట్టణంలోని పాత తహసీల్ కార్యాలయ ఆవరణలో వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ భవనం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రూ.2.75 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఫిబ్రవరి 8, 2022న అప్పటి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఏడాది కాలంలో పునాదులతో పాటు పిల్లర్ల పనులు పూర్తయి శ్లాబ్ వరకు పనులు ముమ్మరంగా జరిగాయి. అనంతరం కాంట్రాక్టరు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు కుంటుపడ్డాయి. అంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఈ భవనం గురించి పట్టించుకున్న వారు కరువయ్యా రు. కనీసం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ భవనం గురించి ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిధులున్నా పనులు ముందుకు సాగకపోవడంపై వ్యాపారులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై కూరగాయలు, నాన్‌వెజ్ విక్రయాలు జరపడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా మంత్రి స్పందించి సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ భవనాన్ని పూర్తి చేసి క్రయవిక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
హుస్నాబాద్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ భవనం పనులు కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో ఆగిపోయాయి. ఇప్పటి వరకు శ్లాబ్ లెవల్ వరకు పనులు జరిగాయి. మిగులు పనుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాం. కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరలోనే పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామని మం త్రి హామీ ఇచ్చారు. త్వరలోనే పనులు ప్రారంభమై భవనం పూర్తి కాగానే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తు న్నం. ఈ భవనం పూర్తయితే విక్రయాలన్నీ ఒకేచోట జరిగి ఇటు ప్రజలకు, అటు వ్యాపారులు, రైతులకు మేలు జరగనుంది.
-ఆకుల రజితావెంకట్, మున్సిపల్ చైర్పర్సన్ హుస్నాబాద్