సిద్దిపేట, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతిని ధి):పాచితో కూడిన వాటర్ ట్యాంకులు, పాకురు పట్టిన పైప్‌లు, ట్యాంకుల చుట్టూ అపరిశుభ్రత, పైప్‌లైన్ లీకేజీలు, నెలల తరబడి మరమ్మతులకు నోచుకోని వైనం, ఫలితంగా కలుషిత నీరే ప్రజలు వినియోగించాల్సి వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వక పోవడం తో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం సంజీవన్‌రావుపేటలో కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతి చెందడంతో పాటు పలువురు తీవ్ర అస్వస్తతకు గురైన సంఘటన తెలిసిందే. కాంగ్రెస్ ప్రభు త్వం మిషన్ భగీరథ నీటి నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో ఇటీవల కాలంలో నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలు గుక్కెడు తాగునీటికి తిప్పలు పడుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏ దవాఖాన చూసినా రోగులతో కిటకిటలాడుతున్నది. గ్రామాల్లో అపరిశుభ్రతతో జనం రోగాల బారిన పడుతున్నారు. తాగునీరు కలుషితంతో అనారోగ్యానికి గురవుతున్నా రు. పరిశుభ్రంగా ఉంచాల్సిన ట్యాంకులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సం గారెడ్డి జిల్లాల్లో ప్రధాన పట్టణాలు, గ్రామాలు, తం డాల్లో కలుషిత నీరు సరఫరా అవుతున్నది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం, వారికి సురక్షిత నీరు అందించాలన్న ఆలోచన చేయడం లేదు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సమస్యలపై జిల్లా మంత్రులు కనీసం సమీక్షలు చేయడం లేదు.
అధికార యంత్రాంగం సైతం ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నది. వెరసి ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సిద్దిపేట జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు, 756 ఆవాస ప్రాంతాలు ఉన్నాయి. పాతవి, కొత్తవి కలిపి 1657 ట్యాంకులు, 2,32, 223 నళ్లా కనెక్షన్లు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 719 ట్యాం కులు, 1,92,857 నళ్లా కనెక్షన్లు, సం గారెడ్డి జిల్లాలో 647 గ్రామ పంచాయతీలు, 943 ఆవాస ప్రాం తాలు, 2,79,919 నళ్లా కనెక్షన్లు, 1,658 ట్యాం కులు ఉన్నాయి. ఇవన్నీ బీఆర్ఎస్ హయాం లో ఇచ్చారు.
పట్టణాల్లో ఒక్కొక్కరికి 135 లీటర్లు, గ్రామాల్లో ఒక్కొక్కరికి 100 లీటర్ల శుద్ధి చేసిన నీటి ని అందించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో 2011 ప్రకారం 33,07,121 జనాభా ఉన్నారు. వీరిలో 16,60,083 మంది పురుషులు, 16,47,083 మంది మహిళలు ఉన్నారు. 2022లో 35, 85,580 మంది జనాభా(అంచనా)కాగా, వీరిలో 17,99,813 మంది పురుషులు, 17,85,767 మంది మహిళలు ఉన్నారు. 2022లోసిద్దిపేట జిల్లాలో 10,97,281 మొ త్తం,5,46,454 పురుషులు 5,50,827 మహిళలు ఉన్నారు. మెదక్ జిల్లాలో 8,32,045 మంది జనాభా కాగా, వీరి లో పురుషులు 4,10,481, మహిళలు 4,21, 564 ఉన్నారు. సంగారెడ్డి జిల్లా లో 16,56,254 మొత్తం జనాభా కాగా, పురుషు లు 8,42,878, మహిళలు 8,13,376 ఉన్నారు.
గ్రామాలు, పట్టణాల్లో పైప్‌లైన్ లీకేజీలతో తాగునీరు కలుషితం అవుతున్నది. లీకేజీలకు మరమ్మతులు చేయించకపోవడంతో ప్రజలకు కలుషిత నీరే వాడాల్సి వస్తున్నది. ఫలితంగా రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం లేదు. ట్యాంకులను ప్రతినెలా మూడు సార్లు శుభ్రం చేయాలి. కానీ, నెలల తరబడి శుభ్రం చేయడం లేదు. ట్యాంకుల చుట్టూ పాచి పేరుకుపోతున్నది. ట్యాంకు లోపల పాకురు పట్టి శుధ్ధిచేసిన నీరు అంతా కలుషితం అవుతున్నది.
తద్వారా పైప్‌ల నుంచి పాకురు పట్టిన నీటితోపాటు మురుగు నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. చాలాచోట్ల మురుగు కా ల్వల్లో పైప్ లైన్లు ఉండడంతో నీరు కలుషితం అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం జీపీలకు నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ కార్యదర్శులు పనులు చేయించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయించారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం తో కార్యదర్శులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం మిషన్ భగీరథను సరిగ్గా అమలు చేయడం లేదు. నిత్యం ఏదో ఒకచోట మహిళలు తాగునీటి కోసం బిందెలతో రోడ్డ్డెక్కుతున్నారు. ఏడాది కాలంగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. వారికి ఎలాం టి నిధులు కేటాయించక పోవడంతో ఎలాంటి పను లు చేయలేకపోతున్నారు. ట్యాంకుల వద్ద క్లోరినేషన్ సరిగ్గా చేయ డం లేదు. పారిశుధ్యం పడకేసింది. చెత్త నిర్వహణ సరిగ్గా చేయడం లేదు. దోమ ల మందు పిచికారీ చేయడం లేదు. దోమలు, ఈగ లు బాగా వృద్ధి చెందాయి. ఫలితంగా గ్రామాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.