అమీన్పూర్,ఏప్రిల్ 28 : సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడలో సర్వేనంబర్ 993 ప్రభుత్వ స్థలం పెద్ద ఎత్తున కబ్జాలకు గురవుతున్నట్లు తెలుసుకొని అమీన్పూర్ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు సోమవారం ఆ స్థలాలను పరిశీలించారు.అనంతరం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహ్మగౌడ్, మాజీ కౌన్సిలర్ ఎండ్ల రమేశ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు అదెళ్లి రవీందర్ మాట్లాడుతూ.. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అయ్యాయని అవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ స్థలాల పక్కన ప్రైవేట్ స్థలాల సర్వేనంబర్ల రిజిస్ట్రేషన్లు వేసుకొని రూ.కోట్ల విలువ గల భూములను కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమ రిజిస్ట్రేషన్లు,నిర్మాణాలపై అధికారుల అవినీతి, అలసత్వం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు మొద్దునిద్ర వీడి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరారు. అనంతరం తహసీల్ కార్యాలయానికి వెళ్లి ప్రభుత్వ భూములు కాపాడాలని డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
బీరంగూడ ఆలయం వద్ద రహదారి పక్కనే ఉన్న రూ.20 కోట్ల విలువైన సుమారు 5వేల గజాల స్థలం కబ్జాను కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నందారం రమేశ్‌గౌడ్, శ్రీనివాస్, మల్లేశ్, జ్ఞానేశ్వర్, ఇంద్రేశం ప్రకాశ్ పాల్గొన్నారు.