అమీన్పూర్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ఇటీవల పలు గ్రామాలను అమీన్పూర్ మున్సిపల్లో ప్రభుత్వం కల్పింది. సర్వే నంబరు 32, 630, 947, 993, 1000, 1112లో ఉన్న ప్రభుత్వ భూములను కొందరు బడాబాబులు ఆక్రమించి ప్లాట్లు వేసి ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
మే 30న సర్వేనంబర్ 947లో అక్రమంగా శెట్టికుంట, ఊబకుంట చెరువులో నిర్మా ణం చేసిన ఇండ్లను అధికారులు కూల్చివేశారు. మే 28న సర్వే నంబరులో 1000లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారని గ్రామస్తులు లోకాయుక్తాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు భూములు పరిశీలించారు. 18.11 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 16.28 ఎకరాలు ఉంది. 2 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. 1000 సర్వే నంబరులో రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు అక్రమాలకు పాల్పడి రియల్ వ్యాపారులకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి.
అమీన్పూర్లో ఎకరం భూమి విలువ కోట్లాది రూపాయలు పలుకుతున్నది. దీంతో రియల్ వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కలసి భూములను మాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ అధికారుల పాత్ర ప్రముఖంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు వారి బంధువులు, స్నేహితుల పేరుతో ప్రభుత్వ భూముల్లో ప్లాట్ల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సమగ్ర విచారణ, పూర్తిస్థాయిలో సర్వేచేసి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.