సంగారెడ్డి, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా)ను ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, 466 పంచాయతీలతో సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(SUDA) ఏర్పాటు చేసింది. ఇప్పటికే జిల్లాలో 181 పంచాయతీలు హెచ్ఏండీఏ పరిధిలోని ఎనిమిది మండలాల్లో ఉన్నాయి. జిల్లాలోని మిగతా గ్రామ పంచాయతీలన్నీ సుడా పరిధిలోకి తెచ్చింది. జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, అందోల్-జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలతో పాటు 21 మండలాల్లోని 466 పంచాయతీలను సుడా పరిధిలోకి వచ్చాయి.
దీంతో జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీలు అన్ని సుడా, హెచ్ఎండీఏల పరిధిలోకి చేరాయి. ఇది వరకే హెచ్ఏండీఏ పరిధిలో సంగారెడ్డి, కంది, రామచంద్రాపురం, పటాన్చెరు, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం, హత్నూర మండలాలు, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం, మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్‌లో భారతీనగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్లు ఉన్నాయి. దీంతో జిల్లాలో వందశాతం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోకి వచ్చింది.
సుడా ఏర్పాటుతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ప్రణాళికాబద్ధ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు, తాగునీటి సరఫరా, మెరుగైన పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రాధాన్యతిస్తారు. పంచాయతీల్లో ప్రణాళికాబద్ధ్దమైన అభివృద్ధి దోహం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది.
‘సుడా’ ఏర్పాటుతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పన్నుల భారం పెరిగే అవకాశం ఉంది. జీప్లస్ 2పైన గృహ నిర్మాణాల అనుమతులు, కొత్త లేఔట్ల అనుమతులు తప్పనిసరిగా కొత్తగా ఏర్పాటైన ‘సుడా’ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో అనుమతుల జారీలో జాప్యం జరిగే అవకాశాలు ఉంటాయి. పంచాయతీల పరిధిలో సుడా కొత్తగా గ్రీన్‌జోన్, ఇండస్ట్రియల్జోన్, రెసిడెన్షియల్జోన్లను ఏర్పాటు చేయనున్నది. దీంతో సుడా నిర్దేశించిన ప్రాంతాల్లోనే నిర్మాణాలను చేపట్టాల్సి ఉంటుంది. పంచాయతీల కొత్త లేఔట్లకు అనుమతుల చార్జీలు, బిల్డింగ్ చార్జీలు పెరిగే అవకాశాలు ఉంటాయి.సుడా పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లోనూ ఆస్తిపన్ను, లేఔట్ల చార్జీలు, బిల్డింగ్ చార్జీల భారం పెరుగుతుంది.
కొత్తగా ఏర్పాటు కానున్న సుడాకు ప్రస్తుత జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం తర్వాత కాలంలో సుడాకు చైర్మన్‌ను నియమిస్తుంది. నామినేటెడ్ పద్ధతిలో సుడా చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. సుడా చైర్మన్ పదవిపై అప్పుడే కాంగ్రెస్ నేతల కన్ను పడింది. ఈ పదవిపై కొందరు కాంగ్రెస్ నేతలు అప్పుడే దృష్టిసారించారు. సమయానుకూలంగా పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నారు.