రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు పెద్దపీట వేస్తున్నది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటలకు భారీగా రాయితీలు కల్పించి సాగును ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ, ఉపాధిహామీ పథకంలో ఈ తోటల పెంపకానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. రైతుకు ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉండి, ఐదెకరాల్లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకంలో అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ పరికరాలపై 90శాతం సబ్సిడీని అందిస్తున్నది. రైతులు తన వాటాగా 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. 2023-24లో సిద్దిపేట జిల్లాలో వివిధ రకాల పండ్ల తోటలను 2010 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 1542, సంగారెడ్డి జిల్లాలో 2360 ఎకరాల్లో మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 5912 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
– సిద్దిపేట, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం ఉద్యాన తోటలకు భారీగా రాయితీలను కల్పించి సాగును ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ, ఉపాధిహామీ పథకంలో ఈ తోటల పెంపకానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు, గుంతలు ఉపాధిహామీ పథకంలో చేపడుతారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ పరికరాలపై 90శాతం సబ్సిడీని అందిస్తున్నది. రైతులు తన వాటాగా 10శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీని ఇస్తున్నది.
ఎస్సీ,ఎస్టీ రైతులతోపాటు 5 ఎకరాల్లో చిన్న, సన్నకారు రైతులు కచ్చితంగా ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉండాలి. 2023-24లో సిద్దిపేట జిల్లాలో వివిధ రకాల పండ్ల తోటలను 2,010 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 1,542 ఎకరాల్లో, సంగారెడ్డి జిల్లాలో 2,360 ఎకరాల్లో, మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 5,912 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 2014 నుంచి 2023 వరకు సిద్దిపేట జిల్లాలో 1835మంది రైతులు 2,158 ఎకరాలు సాగు చేశారు. మెదక్ జిల్లాలో 278మంది రైతులు 367 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1,027 మంది రైతులు 1436 ఎకరాలు సాగు చేసినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. రెండేండ్ల నుంచి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. చాలామంది రైతులు ముందుకొచ్చి సాగు చేస్తున్నారు. వేల ఎకరాల్లో సాగవుతున్నది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఈజీఎస్)లో…
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు పెద్దపీట వేస్తున్నది. కూరగాయలు, పండ్లు, ఇతర ఉద్యాన పంటలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాయితీలతో కూడిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో తోటల పెంపకం చేపట్టవచ్చు. తద్వారా చిన్న,సన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రైతుకు ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డు కలిగి ఉండి, ఐదెకరాల్లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకంలో అవకాశం కల్పిస్తున్నారు. నీటి వనరులు ఉన్న రైతులు వరి సాగు చేస్తుండడంతో ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నది. వరికి ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా రాయితీలు ప్రకటించింది.
మూడేండ్లపాటు సంరక్షణ బాధ్యతలు
పండ్ల తోటల సంరక్షణ బాధ్యతలకు సంబంధించి మూడేండ్లపాటు ప్రభుత్వమే నిర్వహణ ఖర్చులను చెల్లిస్తున్నది. మొకలు, ఎరువులు, కొనుగోలు నిర్వహణ, గుంతలు తీయడానికి, మొకలు నాటడం వంటి పనులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కంద చెల్లిస్తున్నది. ప్రధానంగా జిల్లాలో మామిడి తోటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎకరాకు 70 మొక్కలు ఇస్తారు. రైతులు బయట నర్సరీల్లో కొనుగోలు చేస్తే ఒక్కో మొక్కకు 30 రూపాయలు చెల్లిస్తారు. బత్తాయి మొకకు రూ.44, ఇలా అన్ని మొకలకు డబ్బులు చెల్లిస్తుంది. ఎరువుల కోసం, మొక్కకు ఊతకర్ర తదితర వాటికి ఒక్కో మొకకు రూ. 50, నిర్వహణ ఖర్చులకు నెలకు రూ.10 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. గుంతలు తీయడం. మొకలు నాటడం వంటి పనులన్నీ గ్రామాల్లో ఉపాధిహామీ కూలీలతో చేయించాల్సి ఉంటుంది. సేద్యం పరికరాలను రాయితీపై అందజేస్తారు. ఐదెకరాల్లోపు భూమి ఉండి ఉపాధిహామీ జాబ్‌కార్డు కలిగిన రైతులకు బిందుసేద్యం (డ్రిప్)పథకంలో రాయితీ కల్పిస్తారు. సాగునీటి వసతి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం. చిన్న, సన్నకారు రైతులకు 90శాతం రాయితీపై బిందుసేద్యం పరికరాలు అందిస్తారు.
తోటల పెంపకానికి మార్గదర్శకాలు
అధికారులు ఈనెల 31లోగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 15లోగా డ్రిప్, గుంతలు, మొక్కలు తదితర వాటికి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతులు తీసుకుంటారు. అనుమతులు రాగానే ఆగస్టు 15 నుంచి రైతుల భూముల్లో డ్రిప్ పనులు పూర్తి చేస్తారు. ఆగస్టు నెలాఖరు వరకు గుంతలు తీసి, మొక్కలు నాటే పనులను పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
రైతులు ఉద్యానవన పంటల సాగును సద్వినియోగం చేసుకోవాలి. వివిధ రకాల పండ్ల తోటలు సాగుచేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా తోటలు సాగు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటల సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులకు సబ్సిడీపై డ్రిప్ అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం సబ్సిడీని ఇస్తున్నాం. ఇతర రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్ అందిస్తున్నాం. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 5,912 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యం పెట్టుకున్నాం. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ ప్రాంతంలోని ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించాలి.
– తన్నీరు హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి
సిద్దిపేట జిల్లాలో 2010 ఎకరాలే లక్ష్యం
సిద్దిపేట జిల్లాలో 2010 ఎకరాల్లో లక్ష్యం పెట్టుకున్నాం. నేలల రకాలు, వనరులను పరిగణలోకి తీసుకొని అవకాశం కల్పిస్తాం. మామిడి 925 ఎకరాల్లో, కొబ్బరి 200, జామ 420, నిమ్మ 200, మునగ 140, సీతాఫలం 100, సపోటా 10, డ్రాగన్ ఫ్రూట్ 5, దానిమ్మ 10 ఎకరాల్లో సాగు చేయించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అన్ని పత్రాలతో ఉద్యానవన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారి, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి. ఈ పథకంపై జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.
– పి.సునీత, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి, సిద్దిపేట