అమీన్పూర్, ఏప్రిల్ 18: సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. పలుశాఖల అధికారులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో ఐలాపూర్ భూముల లెక్క ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ సర్కిల్ ఐలాపూర్ పరిధిలోని 1 నుంచి 220 సర్వేనంబర్లలోని 1263 ఎకరాల (సర్ప్ ఏఖాస్) భూములు యాభైఏండ్లుగా వివాదంలో ఉన్నాయి. స్థానికంగా ఉన్న కొంత మంది ఈ భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో భాగంగా ఇటీవల హైడ్రా అధికారులు ఐలాపూర్ పరిధిలోని రెండు ఫామ్‌హౌస్‌లు, ఓ ఆరంతస్తుల భవనాన్ని కూల్చివేయించారు. ఈ కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన అనంతరం హైడ్రా అధికారులు సుమారు 861 ఎకరాల భూమికి ఫెన్సింగ్ వేయించే పనులు చేపట్టారు. 1263 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రతినిత్యం అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి కోర్టు లో వివాదాలు కూడా నడుస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల నేపథ్యం, కోర్టులో భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో సీసీఎల్ఏ కమిషనర్ చైర్మన్‌గా ఉండటంతో పాటు మెట్రోపాలిటిన్, సర్వేశాఖల కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ, న్యాయశాఖ కార్యదర్శులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఉత్వర్వులు వెలువడిన నాటి నుంచి 8 వారాల్లోపు ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఐలాపూర్ పరిధిలోని సర్ప్ ఏఖాస్ భూముల వాస్తవ రూపం, ఈ భూములు ఎవరి కబ్జాలో, ఎవరెవరి పేర్లపై ఉన్నాయి, 1263 ఎకరాలకు సంబంధించిన భూముల గుర్తింపు, ఈ భూమల్లో అనుమతులు ఇచ్చిన అధికారులు తదితర పూర్తి వివరాలను కమిటీ నిర్ధారించనుంది. కమిటీ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఐలాపూర్ భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.