సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 2: ఇటీవల సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలో గాయపడిన హోంగార్డు గోపాల్‌ను ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న హోంగార్డు గోపాల్‌ను పరామర్శించిన విష యం తెలిసిందే.
ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు గోపాల్‌ను పరామర్శించక పోవడంపై హరీశ్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో అక్రమ నిర్మాణాలను డిటోనేటర్లతో కూల్చివేసిన సమయంలో హోంగార్డు గాయపడడం దురదృష్టకరమన్నారు. ఇందుకు స్పందించిన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రూపేశ్, జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవిల తో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్న హోంగార్డు గోపాల్‌ను బుధవారం పరామర్శించా రు.
దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డితో చర్చ లు జరిపారు. గోపాల్‌కు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. హోంగార్డు గోపాల్‌కు జరిగే అన్ని వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ పోలీసు శాఖ గోపాల్ కుటుం బానికి అండగా ఉంటుందన్నారు.