పాపన్నపేట, మే 12: కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం గోల్మాల్ అయినట్లు మెదక్ జిల్లా పాపన్నపేట కౌలు రైతు బైండ్ల భూమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ట్రక్ షీట్ లేకుండానే ధాన్యం రవాణా జరిగిందని, రెండు రోజుల తర్వాత తనకు చెందిన 50 బస్తాల ధాన్యం తక్కువగా వచ్చినట్లు ఐకేపీ సభ్యులు చెబుతున్నారని వాపోయారు. వివరాల్లోకి వెళితే… పాపన్నపేట పెద్ద ఎస్సీ వాడ వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.
శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన కౌలు రైతు బైండ్ల భూమయ్య, బట్టి భారతి, ప్రభాకర్, నదరి నారాయణ, చోటు, కుర్మ కిషన్‌లకు చెందిన 766 వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేసినట్లు బాధిత రైతు తెలిపాడు. అందులో తనవి 391 బస్తాలు ఉన్నాయన్నాడు. 389 బస్తాల వరకు లెక్కబెట్టి డ్వాక్రా గ్రూపు సభ్యురాలు చాక్ పీస్తో సంఖ్య రాసిందన్నారు. అనంతరం రెండు సంచులు తెచ్చి తూకం చేసి లెక్క రాయించానన్నాడు. శనివారం ఉదయం ట్రక్ షీట్ లేకుండానే లారీ లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ రైస్‌మిల్లుకు వెళ్లిందన్నాడు.
ఆదివారం ఐకేపీ సభ్యులు తనకు చెందిన 50 బస్తాలు తక్కువగా వచ్చినట్లు సమాచారం ఇచ్చారని వాపోయాడు. ఇతరుల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశానని, ఇప్పుడు సుమారు 20 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా చూపడంతో సుమారు రూ. 47 వేల నష్టం వస్తుందన్నాడు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.
ఈ విషయమై కమ్యూనిటీ కోఆర్డినేటర్ శివరాణిని వివరణ కోరగా చీకటి కావడంతో కమిటీ మెంబర్లు లోడ్ కాకముందే ఇంటికి వెళ్లారని, మిగతా సంచులు లోడ్ చేద్దామని శనివారం ఉద యం కేంద్రం వద్దకు వచ్చేసరికి లారీ లోడ్ చేసుకొని ట్రక్ షీట్ లేకుండానే వెళ్లి పోయిందన్నారు. ట్రక్ షీట్‌పై కమిటీ మెంబర్ల సంత కం ఉంటుందన్నారు. తర్వాత ట్రక్ షీట్ రైస్ మిల్లుకు పంపినట్లు చెప్పారు. అనంతరం 50 సంచులు తక్కువగా వచ్చినట్లు చెప్పారన్నా రు. హమాలీలు కూడా క్వింటాలుకు రూ.40 తీసుకుంటున్నందున వారి వద్ద కూడా లారీలో ఎన్ని బస్తాలు వెళ్లింది లెక్క ఉంటుందన్నారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.