మర్కూక్, ఆగస్టు 22: కాళేశ్వరం మొదలుకొని కొండపోచమ్మ ప్రాజెక్టులోకి తరలి వస్తున్న గోదావరి జలాలు కేసీఆర్ సుభిక్ష పాలనకు ఆనవాళ్లు అని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కొండపోచమ్మ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోకి పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాళేశ్వరం అంటే కేసీఆర్,కాళేశ్వరం అంటే రైతన్నా,కాళేశ్వరం అంటే తెలంగాణ,కాళేశ్వరం అంటే తెలంగాణ రైతన్నల సంజీవని, కాళేశ్వరం అంటే రైతన్న సమాహారం అని అన్నారు. అబద్ధ్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఏర్పడిందన్నారు.
సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలు, హామీలు అటకెక్కించారని విమర్శించారు. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై,హరీశ్‌రావుపై,కేటీఆర్ పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుని రేవంత్ పాలన గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. రంగనాయకసాగర్ ,మల్లన్నసాగర్,కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కున్నాయని, కాళేశ్వరం నుంచి రిజర్వాయర్లకు గోదావరి జలాలు వస్తుంటే కండ్లులేని కబోదుల్లాగా కాంగ్రెస్ సీఎం, మంత్రులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మల్లన్నసాగర్,కొండపోచమ్మసాగర్ నింపి హల్దీవాగు,కూడవెల్లి వాగు,సంగారెడ్డి కెనాల్,రామాయంపేట కెనాల్లోకి గోదావరి జలాలను వదిలి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. హరీశ్‌రావు వార్నింగ్ ఇస్తే తప్ప రైతులకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిందన్నారు. బీజేపీ నాయకులు నోరు విప్పితే అబద్ధ్దాలు మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీ కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్ర సంపద దోచుకుంటున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం సాగునీరు ఇవ్వడం చేతకావడం లేదని, రైతులకు యూరియా అందించడంలో విఫలమైనట్లు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీని ప్రజలు బొంద పెడతారని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పాండుగౌడ్, బాల్‌రాజు, కృష్ణయాదవ్, మ్యాకల కనకయ్య, నాయకులు నవాజ్‌మీరా, సుధాకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సాయిని మహేశ్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.