మద్దూరు (ధూళిమిట్ట), జనవరి 21: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు విడుదల చేయలేదు. నీటిమట్టం తగ్గడం, ప్రధాన కాల్వ ఎండిపోతున్న వైనాన్ని ఆదివారం ‘నమస్తే తెలంగాణ దినపత్రిక’లో ‘గోదావరి జలాల కోసం ఎదురు చూపు’ అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన దేవాదుల అధికారులు ఆదివారం రిజర్వాయర్లోకి గోదావరి జలాలను విడుదల చేసి, ప్రధాన కాల్వలోకి నీటిని వదిలారు.
కాల్వ పరీవాహక ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, లద్నూర్ రిజర్వాయర్లోకి వస్తున్న గోదావరి జలాలను సర్పంచ్ జీడికంటి సుదర్శన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్లోకి పూర్తిస్థాయిలో నీటిని వదిలేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట కొమురవెల్లి ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్ కాసర్ల కనకరాజు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నంద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.