హుస్నాబాద్, సెప్టెంబర్ 14: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మైదంశెట్టి నక్షత్రహాసిని(13) శనివారం విషజ్వరంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజులుగా నక్షత్రహాసిని జ్వరంతో బాధపడుతోంది.
స్థానికంగా వైద్యం చేయించినా తగ్గక పోవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్సలు చేయిస్తున్నక్రమంలోనే బాలిక మృత్యువాత పడింది. మనవరాలిని కోల్పోయిన కాంగ్రెస్ నాయకుడు మైదంశెట్టి వీరన్నతోపాటు బాలిక కుటుంబ సభ్యులను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సాయంత్రం పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. నక్షత్రహాసిని మృతదేహం వద్ద పూ లమాల వేసి నివాళులర్పించారు. బాలిక మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.