సిద్దిపేట, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడుదామని ఆశగా ఎదురుచూసిన జనరల్ కేటగిరీకి చెందిన ఆశావహులకు నిరాశ ఎదురైంది. ఎన్నో రోజుల నుంచి గ్రామాన్ని పట్టుకొని ఉంటే తీరా రిజర్వేషన్ అనుకూలంగా రాకపావడంతో.. ఇప్పుడు ఎలా..? తమ పరిస్థితి ఏంటి..? అని రిజర్వేషన్ అనుకూలంగా రాని ఆశావహులు వారిలో వారు మదన పడుతున్నారు.వారంతా ఇప్పుడు కోర్టు తీర్పు కోసం ఆశగా ఎదరు చూస్తున్నారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర పభుత్వం విడుదల చేసిన జీవో 9ని కొట్టి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఈనెల 8న కోర్టు తమ తీర్పును వెలువరించనున్నట్లు సమాచారం. ఒకవేళ తీర్పు తమకు అనుకూలంగా వస్తే బాగుండు అని జనరల్ కేటగికీ ఆశావహులు ఆశగా ఎదరుచూస్తున్నారు.కోర్టు తీర్పుపై జనరల్ కేటగిరీ ఆశావహులు కొండంత ఆశ పెట్టుకున్నారు.మరోవైపు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్‌ను ప్రకటించింది.
ఈనెల 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి సైతం సిద్ధ్దమైంది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి…? అనే దానిపై సైతం అధికారులు రెండో జాబితాను సిద్ధ్దం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ 42శాతం బీసీ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తే జనరల్ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.మిగతా రిజర్వేషన్లలో పెద్దగా తేడాలు ఉండక పోవచ్చు. కోర్టు 42 శాతం రిజర్వేషన్‌ను రద్దు చేస్తే వెంటనే మరో జాబితా విడుదల చేసే విధంగా అధికారులు సిద్ధమవుతున్నారు.
గతంలో బీసీలకు 23శాతం రిజర్వేషన్లు కల్పించి సీట్లు కేటాయించగా, ఈసారి 42శాతం కల్పించి సీట్లు కేటాయించారు.అదనంగా గతానికి ఇప్పటికి 19 శాతం పెరిగింది.దీంతో జనరల్ స్థానాల్లో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల స్థానాలకు కోత పడింది. ఈనెల 8న వెలువరించే కోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు తప్పవు. ఈ తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అసలు కోర్టు ఏం తీర్పు ఇస్తుంది…? ఎన్నికలు జరుగుతాయా..? అసలు జరగవా….? ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఆశావహుల పరిస్థితి తయారైంది.అంతా గందర గోళంగా ఉంది.
గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు..
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. మండలాల వారీగా ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా పార్టీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట. గత జడ్పీ, ఎంపీపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మూడు జడ్పీ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో సైతం మూడు జడ్పీ స్థానాలతో పాటు మెజార్టీ ఎంపీపీలను గెలుచుకునేలా బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది.
సంగారెడ్డి జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్, మెదక్ జడ్పీ ఓసీ జనరల్, సిద్దిపేట జడ్పీ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయ్యింది. ఎక్కడ ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది. అక్కడ ఉన్న సామాజిక వర్గాలు ఏంటి..? ప్రజల్లో అభ్యర్థిపై ఎలాంటి ముద్ర ఉంది..? ఇలా అన్ని కోణాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వచ్చిన సమాచారానికి అనుగుణంగా పార్టీ మండల సమన్వయ కమిటీలు ఇతర పార్టీ ముఖ్యులు కూర్చుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఆ దిశగా పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ఇప్పటికే ఆశావహులు ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్చార్జిలకు తమ మనోగతాన్ని వెల్లడించి టికెట్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. జిల్లాలో రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను బీఆర్ఎస్ శ్రేణుల పంచుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టిందని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదరుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తున్నది.దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది. పోటీ చేయడానికి ఆ పార్టీ నుంచి పెద్దగా అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌లో గూప్ తగాదాలు ఆ పార్టీని కొంప ముంచడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇక బీజేపీ తన అభ్యర్థులను కొన్నిచోట్ల నిలిపేందుకు సిద్ధమవుతున్నది.