Ramayampet | రామాయంపేట, ఫిబ్రవరి 20 : రామాయంపేట పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగడంతో పట్టణంలోని ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది. గురువారం సమ్మె దిగిన కార్మికులు చెత్త ఎత్తకుండా మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. పట్టణంలోని చెత్తంతా ఎక్కడి కక్కడే ఉండిపోయింది. చెత్త వల్ల ఇప్పటికే దోమలు స్వైర విహారం చేస్తుంటే అధికారులు కార్మికుల సమస్యలను గాలికొదిలేసి పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు. ఎటు చూసినా చెత్త వల్ల కంపు.. గల్లీలన్ని కంపు కంపుగా మారాయి. దోమలు, ఈగలు ముసరడంతో చిన్నారులకు, పెద్దలకు కూడా సీజనల్ రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. దీంతో సంబంధిత అధికారులు పారిశుధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు.