పటాన్చెరు, జూన్ 9 : మండల పరిధిలోని చిట్కుల్ పంచాయతీలో సేకరిస్తున్న తడి.. పొడి చెత్తను నక్కవాగులో డంపు చేస్తున్నారు. దీంతో క్రమక్రమంగా ఆ వాగును పూడ్చివేస్తున్నారు. గతేడాది జిల్లాలో ఉత్తమ పంచాయతీగా చిట్కుల్ ఎంపికైంది. ప్రస్తుతం పంచాయతీ అధికారుల ప్రత్యేక పాలనలో మురుగు కూపంగా మారుతున్నది. చిట్కుల్లో గత పాలకవర్గం చేసిన కృషికి ఉత్తమ పంచాయతీగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రగతిని చూపడంతో జిల్లా ఉత్తమ పంచాయతీగా అవార్డు సైతం సాధించింది. రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీగా పోటీ పడింది. పంచాయతీ పాలకవర్గం పాలన మార్చిలో ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. కార్యదర్శి, ప్రత్యేక అధికారుల నేతృత్వంలో పంచాయతీ పాలన కొనసాగుతున్నది. అధికారుల పాలనలో పైకి అన్ని బాగున్నట్టు ఉన్నా.. పరిశీలించి చూస్తే తడి.. పొడి చెత్త నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో నూతనంగా అనేక కాలనీలు వెలుస్తున్నాయి. గ్రామంతో పాటు వడ్డెరకాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలు, గ్రామం నుంచి సేకరించిన తడి.. పొడి చెత్తను నేరుగా గ్రామ శివారులో ఉన్న నక్కవాగులో డంప్ చేస్తున్నారు. ఎక్కువ చెత్త పోగు కాగానే వాటికి నిప్పు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పొగలతో నిండిపోతున్నది. నక్కవాగులో ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు, గృహాలనుంచి వెలువడే చెత్తను టన్నుల కొద్ది వేస్తున్నారు. వీటిని తగులబెట్టడంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంది.
చిట్కుల్లో డంప్ యార్డును బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. ఉత్తమ పంచాయతీగా చిట్కుల్‌కు గుర్తింపు రావడానికి డంప్‌యార్డు నిర్వహణ కూడా ఒక కారణం. గ్రామంలో సేకరించిన తడి.. పొడి చెత్తను రీసైకిల్ చేసి ప్లాస్టిక్ వ్యర్ధాలను అమ్మడం, కూరగాయలు, మట్టిలో కలిసే వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా మార్చే వారు. వానపాములు వదిలిన సేంద్రియా లను నర్సరీలో వాడి మొక్కలను పెంచే వారు. గ్రామంలోని చెత్తను పూర్తిస్థాయిలో పునర్వినియోగం చేస్తుండడంతో చిట్కుల్ పంచాయతీకి రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. అప్పటి కలెక్టర్లు, డీపీవోలు, ఇతర శాఖల అధికారులు జిల్లాకు ఇతర రాష్ర్టాల నుంచి ప్రత్యేక బృందాలు వస్తే చిట్కుల్ గ్రామ పంచాయతీనే చూయించేవారు. గత కొన్ని నెలల్లోనే చిట్కుల్లో పారిశుధ్యం పడకేసింది. డంప్ యార్డు అలంకారప్రాయంగా మారింది. ఎటు చూసి నా మురుగు కాల్వలు దర్శనం ఇస్తున్నాయి. గ్రామంలో సేకరించిన చెత్తను తగుల బెట్టి పర్యావరణానికి హాని చేస్తున్నారు. నక్కవాగు నామరూపాలు లేకుండా చెత్తతో నింపుతున్నారు. నక్కవాగు నీరు నేరుగా మంజీర నదిలో కలుస్తాయి. సాగు, తాగునీటి అవసరాలు తీర్చే మంజీర నదిలోకి టన్నుల కొద్ది చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేయడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిట్కుల్‌తో పాటు బచ్చుగూడెం గ్రామం వర కు చెత్త నుంచి వెలువడుతున్న పొగలు వ్యాపిస్తున్నాయి. పొగలతో అనారోగ్యాలు వస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. చిట్కుల్లో పారిశుధ్యం, చెత్త డంపింగ్‌పై జి ల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన చెత్త ను పునర్వినియోగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నక్కవాగును చెత్తతో పూడ్చివేయడం సరికాదు. వాగులను కాపాడాల్సిన అధికారులే నక్కవాగును చెత్తతో పూడ్చివేయడం ఎంతవరకు సమంజసం. సేకరించిన చెత్తను డంప్‌యార్డులో రిసైకిల్ చేసి ఉపయోగకరంగా మార్చాలి. చెత్తను కాల్వలు, వాగుల్లో పారవేస్తుండటంతో గ్రామం మురుగు కూపంగా మారుతున్నది. ఒకప్పుడు పరిశుభ్రంగా ఉన్న గ్రామం ఇప్పుడు కంపు కొడుతున్నది. వాయుకాలుష్యం పెరుగుతున్నది. ప్రజల ఆరోగ్యాలకు సమస్యగా మారింది. బచ్చుగూడెం, చిట్కుల్ గ్రామాల ప్రజలకు ఈ పొగలతో ప్రమాదం పొంచి ఉంది. అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి.