రామచంద్రాపురం, నవంబర్ 17: ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ఓ ముఠా ఏకంగా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఎన్వోసీని తయారుచేసింది. ఈ విషయం ఆర్సీపురం తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి తెలియడంతో ఆయన విచారణ చేసి కొలూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో సర్వేనంబర్ 191లో స్వాతంత్య్ర సమరయోధుల కోటాలో అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలానికి చెందిన కె.మాణయ్య, ఎం.చంద్రయ్య, బాలయ్య, టేక్మాల్‌కు చెందిన సాంబ మల్లమ్మ, సంగమ్మకు రెండు ఎకరాల చొప్పున మొత్తం 10 ఎకరాల భూమిని 1997లో ప్రభుత్వం కేటాయించింది. 2005లో నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమిని ఇతరులకు విక్రయించారు.
దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఆ భూములపై తమకు హక్కులు ఉన్నాయని స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు మళ్లీ విక్రయించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆ భూములు కొనుగోలు చేసేందుకు స్థానికంగా ఉండే న్యూ ఎంఐజీకి చెందిన శ్రీనివాస్ ముందుకు వచ్చాడు.
పది ఎకరాల భూమిని ఎకరం రూ.1.50కోట్ల చొప్పున ఒప్పందం కుదుర్చుకొని అగ్రిమెంట్ చేసుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులైన వీరేశం, రాములు, సుధాకర్, నాగరాజు, సంతోష్‌కు రూ.లక్ష చొప్పున రూ.5లక్షలు ఇచ్చాడు. శ్రీనివాస్‌తో పాటు మరికొందరు ఓ ముఠాగా ఏర్పడి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఎన్వోసీ అవసరం ఉండడంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంతకాన్ని ఫోర్జరీ చేసి స్వాతంత్య్ర సమరయోధుడు బి.బా లయ్య పేరుపై రెండు ఎకరాలకు ఎన్వోసీని తయా రు చేశారు.
ఈ ఎన్వోసీ వాట్సాప్‌లో ఆర్సీపురం తహసీల్దార్ సంగ్రామ్రెడ్డికి రావడంతో అది గమనించిన ఆయన దీనిపై విచారణ చేపట్టారు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారని గుర్తించిన ఆయన కొల్లూర్ పోలీసులకు ఈనెల 14న ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ రవీందర్ విచారణ చేపట్టారు. ఆ భూములు విక్రయించేందుకు ప్రయత్నించిన వీరేశం, రాములు, సుధాకర్, నాగరాజును పోలీసులు విచారించారు. ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు ప్రయత్నం చేశామని, కలెక్టర్ సంతకాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోర్జరీ చేశారని వాళ్లు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, శ్రీనివాస్ ప్రస్తుతం పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. శ్రీనివాస్‌తో పాటు టేక్మాల్‌కు చెందిన సంగమ్మ మనవడు సంతోష్ పరారీలో ఉన్నాడని ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపారు.