గజ్వేల్, మార్చి 19: కాంగ్రెస్ పాలనలో దోపిడీ పర్వం కొనసాగుతున్నదని గజ్వేల్ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ అంకెల గారెడీ తప్పా ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. రాష్ర్టాన్ని దివాళా తీసేలా ఉందని, హామీలను నెరవేర్చడానికి ఈ బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవని ఆయన విమర్శించారు.
రుణమాఫీ, రైతుభరోసా, కౌలు రైతులకు భరోసా, మహిళలకు మహాలక్ష్మి, ఆటో డ్రైవర్లకు ఆర్థికసాయం, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, రైతు కూలీలకు ఆర్థికసాయం, నిరుద్యోగ భృతిపై ఎక్కడా స్పష్టత లేకుండా బడ్జెట్ కేటాయింపులు చేశారన్నారు. పెన్షన్ల కోసం గ్రామాల్లో ఎదురుచూస్తున్నారని, ఈ బడ్జెట్ ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు.
రూ.6వేల కోట్లతో కాంగ్రెస్ కార్యకర్తల జేబు లు నింపేందుకు ఒక్కొక్కరికి రూ.4లక్షలు రుణం ఇచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించిందని, రాష్ర్టాన్ని రాబంధులా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చోటుకుంటుంటే సీఎం రేవంత్‌రెడ్డికి పట్టడం లేదన్నారు. నీరందక లక్షల ఎకరాల్లో వరిపంట ఎండిపోతున్నదని, కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేస్తే రాష్ర్టాన్ని 50 ఏండ్ల వెనక్కి తీసుకెళ్లారని, మళ్లీ తెలంగాణలో ఎనకటి రోజుల వచ్చాయని విమర్శించారు. అసెంబ్లీలో సీఎం మాటలు ప్రజలు తలదించుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు రాజమౌళి, బొల్లారం ఎల్లయ్య, మల్లేశం, నవాజ్‌మీరా, విరాసత్ అలీ, గుంటుకు రాజు, శ్రీనివాస్‌రెడ్డి, జకీయొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.