రామచంద్రాపురం, డిసెంబర్ 25 : సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో బీఆర్ఎస్ హయాంలో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫంక్షన్‌హాల్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభిస్తే బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ నేతలే అడ్డుకున్నారు. మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగుస్తున్న తరుణంలో ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభానికి సిద్ధం చేశారు. తీరా కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రారంభోత్సవం కాకుండా అడ్డుకున్నారు. దీంతో ఫంక్షన్‌హాల్ నిరుపయోగంగా మారింది. ప్రజల సౌకర్యార్ధం తెల్లాపూర్ గత మున్సిపల్ పాలకవర్గం మోడల్ ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టింది. నాటి మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి, పాలకవర్గ సభ్యులు రూ.8కోట్లు ఖర్చుచేసి పేదల కోసం ఫంక్షన్‌హాల్‌ను నిర్మించారు.
జీ+1 పద్ధతిలో దాదాపుగా 1500మంది సిట్టింగ్ కెపాసిటీతో ఏసీ ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టారు. హాల్‌కు పక్కనే ప్రత్యేకంగా కిచెన్ షెడ్, బయట విశాలమైన పార్కింగ్తో పాటు సెల్లార్ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ప్రైవేట్‌గా ఏసీ కన్వెన్షన్లకు దీటుగా అన్ని హంగులతో తెల్లాపూర్‌లో అన్నివర్గాల వారు వేడుకలు జరుపుకొనేలా నిర్మించారు. దాదాపుగా ఫంక్షన్‌హాల్ నిర్మాణం పూర్తయింది. ఫంక్షన్‌హాల్ లోపల ఏసీలు, ఫర్నిచర్ తదితర చిన్నపాటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. గత జనవరిలోనే ప్రారంభం కావాల్సిన ఫంక్షన్‌హాల్ రాజకీయ కారణాలతో నిలిచిపోయింది. అప్పటి నుంచి 11నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం పట్టడం లేదు.
పేదల కోసం నిర్మించిన అద్భుతమైన ఫంక్షన్‌హాల్ కం డ్లముందు కనిపిస్తున్నా వినియోగించుకునే పరిస్థితి ఉంది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఫంక్షన్‌హాల్స్ లేక పేద,మధ్యతరగతి ప్రజలు శుభకార్యాలు చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట ఏ ఫంక్షన్‌హాల్ చూసినా రూ.లక్షలు అడుగుతున్నారు. లక్షలు వెచ్చించి ఫంక్షన్‌హాల్ తీసుకోవడం పేదలు, మధ్యతరగతి ప్రజలకు తలకుమించిన భారంగా మారింది.
ఈ పరిస్థితిని అర్థం చేసుకొని గత మున్సిపల్ పాలకవర్గం ప్రైవేట్ ఫంక్షన్హాల్లకు దీటుగా అద్భుతమైన, విశాలమైన ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేపట్టింది. అభివృద్ధిని స్వాగతించాల్సిన నేతలే అడ్డుకోవడం ఏమిటని పలువురు కాంగ్రెస్ నేతల తీరును ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు పేరు వస్తుందని ఫంక్షన్‌హాల్‌ను ప్రారంభించకుండా అడ్డుకునప్పటికీ, ప్రజలకు తెలియదా ఎవరి హయాంలో నిర్మాణం జరిగిందో అనే విషయం. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
తెల్లాపూర్ ఫంక్షన్‌హాల్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రా రంభం గురించి పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తా. గతంలో ఏ కారణాలతో ప్రారంభోత్సవం నిలిచిందో నాకు తెలియదు. ప్రస్తుతం ప్రజ లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫంక్షన్‌హాల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తా.
– అజయ్‌కుమార్‌రెడ్డి, తెల్లాపూర్ డిప్యూటీ కమిషనర్