పటాన్చెరు, మే 19: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో రియల్ వ్యాపారుల భూదాందాకు వాగులు, నాలాలు కనుమరుగు అవుతున్నాయి. వీటిని కాపాడాల్సిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు రియల్ వ్యాపారులతో అంటకాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నీటిపారుదల శాఖలో ఇంజినీరింగ్ అధికారులు భారీగా డబ్బు లు తీసుకుని ఇష్టారాజ్యంగా ఎన్వోసీలు జారీచేస్తుండడంతో ప్రకృతి వనరులకు ముప్పు ఏర్పడుతున్నది.
పటాన్చెరు నీటిపారుదల శాఖ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. వెంచర్లు, భవనాలు నిర్మించే ముందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు నీటి పారుదల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. వ్యవసాయ భూములను వెంచర్లుగా నిర్మాణం చేసే ముందు వ్యాపారులు ఎన్వోసీలు తీసుకోవాలి. వాగులు, కాల్వలు అక్రమించి ప్లాట్లు వేసిన నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవ డం లేదు. ఆ శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు రియల్ వ్యాపారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణం చేసినా ఆ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేద నే ఆరోపణలు ఉన్నాయి. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో వాగు లు, నాలాలు ఆక్రమించి జోరుగా నిర్మాణాలు చేస్తున్నారు. ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. ఏఈలు, డీఈలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఎన్వోసీలు జారీచేస్తున్నారు. ప్రకృతిసిద్ధ్దంగా ఉన్న వాగులు, కాల్వలు(నాలాలు) దారిమళ్లింపులు చేసినా ఇంజినీరింగ్ అధికారులు ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదు.
భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో రియల్ వ్యాపారులు వాగులు, నాలాలు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. పటాన్చెరు మండలంలోని వాగులు, నాలాలను మట్టిపోసి పూడ్చివేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వాగులు, నాలాలు ఆక్రమించినా చర్యలు తీసుకోవడం లేదని రెవె న్యూ అధికారులను ప్రశ్నిస్తే మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు వస్తాయని, తాము అటువైపు వెళ్లం అని చెబుతున్నారు. రూ. లక్షలాది విలువ చేసే భూములు ఆక్రమించినా చర్యలు తీసుకోవడం లేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల అనుచురులే ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పటాన్చెరులో వాగులు, నాలాలు ఆక్రమణ
పటాన్చెరు హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో భూ ముల ధరలు విపరీతంగా పెరిగిపోచాయి. దీంతో రియల్ వ్యాపారులు వాగులు, నాలాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ భూములు రైతుల నుంచి కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు చేస్తున్నారు. వాగులు, నాలాలు ఆక్రమించి రియల్ వ్యాపారులు ప్లాట్లు వేయడంతో వర్షాకాలం వరద బయటకు వచ్చే ప్రమాదం ఉంది. పటాన్చెరు మం డలంలోని పటాన్చెరు, నందిగామ, ముత్తంగి, చిట్కుల్ గ్రామాల్లో వాగులు, నాలాలను మట్టిపోసి పూడ్చివేస్తున్నా నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
నీటిపారుదల శాఖలో పనిచేసే ఏఈలు క్షేత్రస్థాయిలో వాగులు, నాలాలు పరిశీలించి అనుమతుల కోసం డీఈలకు నివేదిక ఇవ్వాలి. ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్నవారు ముందుగా నీటిపారుదల శాఖ అధికారులకు భూమి కి సంబంధించిన పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లు అందజేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీ అధికారులు సిఫారసు చేసిన పత్రాలు మ్యాపు, సర్వే నంబరు వివరాలు అందజేయాలి. ఎన్వోసీ ఎందుకోసం తీసుకుంటున్నారో అధికారులకు చూపించాలి.
ప్రకృతి సిద్ధ్దంగా ఉన్న వాగులు, కాల్వలకు ఎక్కడా నష్టం జరగకుండా చూసి అనుమతులు ఇవ్వాలి. కానీ, ఇంజినీరింగ్ శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేస్తున్నారు.దీంతో వాగులు, కాల్వలు కనుమరుగు అవుతున్నాయి. ముం దుగా రియల్ వ్యాపారులు లారీలతో మట్టిని తీసుకువచ్చి వాగులు, కాల్వల దగ్గర డంపింగ్ చేసేస్తున్నారు. ఒకరోజు తర్వాత ఎవరు రాకపోతే మట్టిని వాగులు, నాలాలో పోసి మూసివేయిస్తున్నారు. వారం రోజులో వాగు, నాలా ఉన్న ప్రాంతం ప్లాట్లుగా మార్చేస్తున్నారు. మట్టి పోసే సమయం లో రియల్ వ్యాపారులు యువకులను కాపలాగా నియమిస్తున్నారు. కొత్తవారు ఎవరైనా వస్తే ఎందుకోసం వచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఫొటోలు తీస్తే బెదిరిస్తున్నారు.
ఏఈ, డీఈ పోస్టులకు భారీగా డిమాండ్..?
పటాన్చెరు ప్రాంతంలో నీటిపారుదల శాఖలో పనిచేసేందుకు ఏఈలు, డీఈలు భారీగా డబ్బులు ఖర్చు చేసుకుని వస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో పా టు పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. దీంతో వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం లో వ్యవసాయ భూములు వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లు అమ్మకాలు చేస్తున్నారు.
ప్రతి వెంచరు నిర్మాణం కోసం రియల్ వ్యాపారులు నీటిపారుదల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. దీంతో ఆ శాఖ కార్యాలయంలో పనిచేసే ఏఈలు, డీఈలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొందరు అధికారులు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ద్వారా రికమండేషన్ పత్రాలు తీసుకుని బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. పోస్టింగ్ కోసం భారీగా డబ్బులు ముట్టజెపుతున్నట్లు తెలిసింది. పటాన్చెరులో ఎలాంటి అభివృద్ధి పనులు లేకపోయినా ఏఈలు, డీఈలు పోటీపడి ఇక్కడ పోస్టింగ్‌లు తీసుకుంటున్నారు. ఎన్వోసీలు జారీ పేరుతో భారీగా అక్రమార్జన సాగిస్తున్నట్లు తెలిసింది. అధికారుల అవినీతి, అక్రమాలతో వాగులు, కాల్వలు మాయం అవుతున్నాయి. దీంతో వరద తప్పేలా లేదు.
నీటిపారుదల, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం..?
నీటిపారుదల, రెవెన్యూశాఖ అధికారుల మధ్య సమన్వయ లోపంతో వాగులు, నాలాలు, కాల్వలు మాయమవున్నాయి. రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో రియల్ వ్యాపారులు డబ్బులు ఇచ్చి అనుమతులు తీసుకొని నిర్భయంగా మట్టిపోసి మూసివేస్తున్నారు. అక్రమాలు నివారించే అధికారులే ఎన్వోసీలు జారీ చేయడంతో వాగులు, నాలాలు కనిపించడం లేదు. వాగులను మట్టిపోసి మూసివేస్తున్నారని, అధికారుల దృష్టికి తీసుకుపోయినా వారు స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారని కొందరు అధికారులు బహిరంగా చెబుతున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు నీటిపారుదల శాఖకు సర్వేచేసి నివేదిక ఇవ్వాలని నోటీస్‌లు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిసింది. కొందరు అధికారులు పటాన్చెరు ప్రాంతంలో ఏఈలుగా పనిచేసి ప్రస్తుతం పైస్థాయిలో ఉండి ఇక్కడ పనిచేస్తున్నారు. దీంతో రాజకీయ నాయకులు, రియల్ వ్యాపారులతో సంబంధాలు ఉండడంలో క్షేత్రస్థాయి పర్యటనలు లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నారు. వాగులు ధ్వంసం చేసినా చర్యలు తీసుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటాం..
వాగులు, నాలాల పర్యవేక్షణ నీటిపారుదల శాఖ అధికారులు చూస్తారు. మండలంలో ఉన్న వాగులు, నాలాలు ఆక్రమించినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. ఓఆర్ఆర్ పక్కన వాగును ఆక్రమించి మట్టిపోస్తున్నట్లు సమాచారం లేదు. నీటిపారుదల శాఖ అధికారులు వాగులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా చూడా లి. రెవెన్యూ తరపున ప్రభుత్వభూములు కాపాడుతాం.
– రంగారావు, తహసీల్దార్ పటాన్చెరు