కొండపాక(కుకునూరుపల్లి), సెప్టెంబర్ 14 : జీవితంలో డబ్బే పరమావధిగా కాకుండా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సద్గురు మాధుసూదన్ సాయి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 2022 నవంబర్ 18న చిన్నారులకు ఉచిత వైద్యం కోసం నాటి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించిన దవాఖానలో శనివారం పూర్తిస్థాయి వైద్య సేవలను సద్గురు మాధుసూదన్ సాయి, ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి, ట్రస్ట్ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సద్గురు మాధుసూదన్ సాయి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో కేవీ రమణాచారి సంపూర్ణ సహకారంతో కొండపాకలో సత్యసాయి జూనియర్ కళాశాలతో పాటు చిన్నారుల గుండె సంబంధిత వ్యాధులను నయం చేసేందుకు దవాఖానతో పాటు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ విద్యాలయం, వైద్యాలయం రెండూ ఏర్పాటు చేసేందుకు అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఎంతో కృషి చేశారని, ఆయన అందించిన సహకారంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొండపాకలో ఇంత పెద్ద దవాఖానను నిర్మించి ప్రజలకు అం దుబాటులోకి తెచ్చామని, పేదలు వైద్యసేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పేదలకు సేవ అందించడమే నిజమైన ప్రేమ అని సత్యసాయిబాబా తన పుస్తకంలో రాసుకున్నారని గుర్తు చేశారు. వైద్యరంగం ఇంత అభివృద్ధి చెందినా చిన్నపిల్లలు గుండె జబ్బులతో చనిపోవడం బాధాకరమని, వారిని కాపాడటమే సత్యసాయి ట్రస్ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ పాంతాల్లోని ఆడపిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నామని, కొండపాకలో ఏర్పాటు చేసిన సత్యసాయి జూనియర్ కళాశాలలో చదువుకొని ఉన్నత విద్యకు వెళ్లి ఎంతోమంది విద్యార్థినులు ప్రస్తుతం మంచి ఉద్యోగాలను సాధించి ఆదర్శంగా నిలిచినట్లు చెప్పారు.
కొండపాకలో నర్సింగ్, పారామెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే సత్యసాయి ట్రస్ట్ ద్వారా వర్సిటీని స్థాపిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 25వేల మంది విద్యార్థులకు ప్రస్తుతం అన్నపూర్ణ సేవా ద్వారా రాగి జావ అందిస్తున్నట్లు తెలిపారు. వృద్ధ్ధాశ్రమ నిలయం, దేవాలయం, విద్యాలయం, వైద్యాలయాలతో మమేకమై దేవాలయంగా ఈ ప్రాంతం మారిందన్నారు. సామాజిక సేవే భగవత్ సేవగా ప్రజలు భావించి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సద్గురు మధుసూదన సాయి పిలుపునిచ్చారు.