సిద్దిపేట, డిసెంబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకపోవడంతోపాటు ఎన్నికలకు వెళ్లడం లేదని సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మాజీ సర్పంచ్‌లు కాల్వ ఎల్లయ్య, ఉమేశ్‌చంద్ర, ఆంజనేయులు, పరశురాములు గౌడ్ అన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామా ల్లో సౌకర్యాలు మెరుగుపర్చి ఎంతో అభివృద్ధి చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్‌లకు బిల్లులు ఇస్తే వచ్చే ఎన్నికల్లో వారందరూ మళ్లీ పోటీ చేస్తే కాంగ్రెస్ గెలవడం కష్టమన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీలో హరీశ్‌రావు సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం పొంతన లేని సమాధానం చెప్పడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్‌లపై కక్ష కట్టిందన్నారు. పెండింగ్ బిల్లులపై సర్పంచ్‌లు ఎలాంటి నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వకపోయినా అర్ధరాత్రి మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు మేమేందుకు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. గ్రామా ల్లో అనేక అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన సర్పంచ్‌లు బిల్లులు రాక ఇప్పుడు కూలీ పనులకు వెళ్లి వడ్డీలు కడుతున్నారన్నారు. మాజీ సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల ఆవేదనను అసెంబ్లీలో ప్రస్తావించినందుకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు అజీజ్, నవీన్, రవీందర్ గౌడ్, భిక్షపతి నాయక్ పాల్గొన్నారు.