మునిపల్లి, ఏప్రిల్ 23 : కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై చర్యలు వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. గురువారం మండలంలోని ఖమ్మంపల్లి గ్రామ శివారులోని శ్రీ సాయి గార్డెన్లో స్థానిక విలేకరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు అధికారులపై వేసింది పీసీ ఘోష్ కమిషన్ కాదు.. టీపీసీసీ కమిషన్ అని పేర్కొన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆదేశించడం శుభపరిణామని ఆయని వెల్లడించారు.
ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా పీసీసీ కమిషన్‌గా వ్యవహరించిందని క్రాంతి కిరణ్ విమర్శించారు. కాళేశ్వరం కుంగిందని ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైకోర్టు తీర్పుతో కేసీఆర్, హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారులకు ఊరట దక్కడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నట్లైందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరంలో పిల్లర్ కుంగితే మరమ్మత్తులు చేయాలి తప్ప.. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కుంగి పోయిందని చెప్పడం రాజకీయ కుట్ర అని రేవంత్‌పై ఆయన మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో రాజకీయ లబ్ది కోసమే పీసీ ఘోష్ కమిషన్ పేరుతో ప్రభుత్వం నాటకం ఆడిందనే విషయం తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే ప్రజలకు, రైతులకు నీరు అందుతుందని మాజీ ఎమ్మెలే క్రాంతి కిరణ్ అన్నారు. ముఖ్యంగా అందోల్ నియోజకవర్గంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తున్నారు.. తప్ప మొత్తం కూల్చి వేయడం లేదని, అలాంటిది కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగితే మొత్తం కాళేశ్వరం కుంగిందని చెప్పడం విడ్డురంగా ఉందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపు కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడిందని, కోర్టు తీర్పుతో ఆ కుట్రలు బట్టబయలయ్యాయని క్రాంతి కిరణ్ విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ దుష్ప్రచారం మానేసి, వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ ప్రజలు, రైతుల ప్రయోజనాలను కాపాడాలని ఆయనప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో ధర్మం గెలుస్తుందనడానికి తాజా తీర్పే నిదర్శమని క్రాంతి కిరణ్ వెల్లడించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, సాయికుమార్, మాజీ జడ్పీటీసీ మీనాక్షి సాయికుమార్, రాయికోడ్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు చేవేళ్ల విఠల్, వరం కమిటీ మాజీ అధ్యక్షుడు వీరారెడ్డి, మునిపల్లి, రాయికోడ్ మండలాల ప్రధాన కార్యదర్శులు శశికుమార్, శంకర్, సర్పంచులు ఇర్ఫాన్ పటేల్, మల్లేశం, రమేష్, మాజీ సర్పంచ్ శంకర్, మాజీ ఎంపీటీసీ చిట్కుల వెంకటేశం, పెద్దలోడి ఉప సర్పంచ్ ప్రేమానంద్, మాజీ ఉప సర్పంచ్ తుడుం దుర్గయ్య, నాయకులు తుకారం, బాగన్న, పోల్కంపల్లి శేఖర్, బుచ్చన్న, లింగంపల్లి అప్సర్, మునిపల్లి భద్రప్ప, బుర్ర సురేష్, బోయిని రాజేందర్, మేతరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.