హుస్నాబాద్, జనవరి 6: రైతులను నమ్మించి మోసం చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమా ర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నిబంధనలు లేకుండా, దరఖాస్తు తీసుకోకుండా రైతుబంధు వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మాత్రం రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
రూ.రెండు లక్షల రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని, రూ.రెండు లక్షల పంట రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, మహిళలకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలను, ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని దేవుళ్లపై ఒట్టేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట తప్పడం దారుణమన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ఉద్యమాలు ఆగవని సతీశ్‌కుమార్ హెచ్చరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు సుద్దాల చంద్రయ్య, ఎండీ అన్వర్, తిరుపతిరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, హుస్నాబాద్ పట్టణంతోపాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.