గజ్వేల్, ఏప్రిల్ 5: కాంగ్రెస్ శ్రేణులు దాడులు, చిల్లర పనులు చేయడం మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ పాలన ఎలా ఉందో, స్థానిక నాయకులు అలాగే ప్రవర్తిస్తున్నారని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన చిల్లర మూకలకు తగిన బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు. ఆదివారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకుల ఆగడాలను చూసి ప్రజలే చీత్కరించుకుంటున్నారని, దాడులతో కాదు పదేండ్ల కాలంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిలో పోటీ పడాలని హితవు పలికారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో తెలంగాణ పదేండ్లు అభివృద్ధ్దిలో వెనక్కి వెళ్లిందన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రదాత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్లను నిర్మించి తాగు, సాగునీళ్లు అందించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ఉనికి కోల్పోతున్నామనే భయంతో గూండాల్లా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మెదక్‌లో క్యాంపు కార్యాలయంలో శిలాఫలకంపై సీఎం, అప్పటి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల పేర్లు తొలిగించారని, ఇలాంటి చేష్టలు మానుకోవాలన్నారు.
ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి వాటిని పరిష్కరించాలన్నారు. ఫొటో పెట్టాలని ఎక్కడైనా జీవో ఉందో చెప్పాలన్నారు. పోలీసుల చేతకాని తనంతో కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నట్లు పద్మాదేవేందర్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలను వేధించడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి చేయడంపై చూపాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని విమర్శించారు. గజ్వేల్‌లో జరిగిన దాడిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామన్నారు.