నారాయణఖేడ్, ఆగస్టు 3: అనేక ఆంక్షలు పెట్టి అరకొరగా రుణమాఫీ చేసి సంబురాలు చేసుకోవడం కాదని, ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధన విధించడంతో ఎంతో మంది రుణమాఫీకి దూరమవుతున్నారన్నారు. చెరు కు రైతులకు సంబంధించి రుణమాఫీ మొత్తా న్ని చక్కెర కర్మాగారాలకు కాకుండా రైతుల ఖాతాల్లో జమచేయాలని కోరారు.
ప్రభుత్వం ఆంక్షలతో కేవలం 20 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు రైతు రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి చొరవ చూపి తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేశ్, మాజీ ఎంపీపీలు మహిపాల్‌రెడ్డి, జంగం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు నవాబ్, అభిషేక్ శెట్కార్, ముజామిల్, ఎం.ఏ.నజీబ్, మల్గొండ ఉన్నారు.
తన కష్టసుఖాల్లో అండగా నిలిచిన కార్యకర్తలకు, తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని నారాయణఖేడ్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పుష్పాభిషేకం చేశారు.
నారాయణఖేడ్/కల్హేర్, ఆగస్టు 3: నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పేట్, మండల పరిధిలోని ర్యాకల్, కల్హేర్ మండలం క్రిష్ణాపూర్, నిజాంపేట్ మండలం జమ్మికుంట గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు శనివారం మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు.