నారాయణఖేడ్, జూలై 21: సిర్గాపూర్‌లో పీహెచ్సీ భవన ప్రారంభోత్సవానికి రానున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, కనీసం తన వైద్యారోగ్యశాఖకు సంబంధించి ఇచ్చిన హామీలనైనా నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దామోదర రాష్ర్టానికి మంత్రిగా కాకుండా కేవలం అందోల్‌కు మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రిగా ఏడాదిన్నర గడిచినా నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వలేదన్నారు.
కంగ్టి, పెద్దశంకరంపేట పీహెచ్‌సీలను సీహెచ్‌సీలుగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, అందోల్ నియోజకవర్గంలో ఆరు పీహెచ్‌సీలను మంజూరు చేయడం పక్షపాతం కాకపోతే ఏంటని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో మార్కెటింగ్ మంత్రిగా ఉన్న దామోదర అప్పుడు సైతం జోగిపేట్, వట్పల్లి, రాయికోడ్‌లో మార్కెట్‌యార్డులు, గోదాంలు ఏర్పాటు చేయగా, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఒక్క మార్కెట్ యార్డు ఏర్పాటు చేయలేదని, బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. అందోల్ నియోజకవర్గంలో జేఎన్టీయూ ఉండగా నవోదయను సైతం అతని నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుంటున్నారని, పెద్దశంకరంపేటకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫైర్‌స్టేషన్ మంజూరు చేయగా, దానిని అందోల్ నియోజకవర్గానికి తరలించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ భూపాల్‌రెడ్డి ఆరోపించారు.
కొన్ని రోజుల క్రితం మంత్రి ప్రారంభించిన నిజాంపేట పీహెచ్సీ, మంగళవారం ప్రారంభించబోతున్న సిర్గాపూర్ పీహెచ్సీ భవనం, ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించిన ఫతేపూర్ వంతెన బీఆర్ఎస్ హయాంలో నిర్మించినవేనని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గానికి చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంపై మంత్రికి చిత్తశుద్ధి ఉంటే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి పనులు వేగవంతం చేయాలని, తమ ప్రభుత్వంలో డీపీఆర్ సమర్పించిన కారాముంగి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించి నల్లవాగు ప్రాజెక్టుకు జీవం పోయాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అబద్ధాలు వల్లిస్తున్న ఎమ్మెల్యే…
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టి పూర్తిగా అసత్యాలు మాట్లాడుతూ బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి విమర్శించారు. పీర్లతండాలో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ విషయంలో పట్టించుకోలేదని మాట్లాడడం సిగ్గుచేటని, తాను మాట్లాడిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అబ్బెంద సబ్‌స్టేషన్ ఉందని, అది ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనే విషయాన్ని గుర్తించాలన్నారు. విద్యారంగం విషయంలోనూ ఇవే అవాకులు చెవాకులు పేలుతున్న ఎమ్మెల్యే ఎనిమిది గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు కేజీబీవీల స్థాయి పెంచడంతో పాటు పలు పాఠశాలల స్థాయి పెంపు, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
గతంలో సిర్గాపూర్, బీబీపేట పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైతే బాధ్యులైన ఉపాధ్యాయులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, తాజాగా మోర్గి మోడల్ స్కూల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని, ఇది కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ తీరు అని ఎద్దేవా చేశారు. నాగల్గిద్ద మండలం శికార్ఖాన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడిని ఎమ్మెల్యే తన రాజకీయాలకు వినియోగించుకుంటూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నగేశ్, నాయకులు ముజామిల్, ప్రభాకర్, విజయ్ బుజ్జి, మహిపాల్‌రెడ్డి, విఠల్‌రావు, మల్గొండ, లక్ష్మణ్‌నాయక్, యాదవరావు తదితరులు పాల్గొన్నారు.