నారాయణఖేడ్, సెప్టెంబర్ 12: పదేండ్ల కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత రౌడీ రాజ్యంగా మారిందని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. గురువారం నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్ర రాజధానిలో ఒక ఎమ్మెల్యే ఇంటిపై మరో ఎమ్మెల్యే, అతడి అనుచరులు మూకుమ్మడిగా దాడికి పాల్పడడం దేనికి సం కేతమని ప్రశ్నించారు.
శేరిలింగంపల్లి ఎమ్మె ల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరి ఇటీవల వచ్చిన హైకోర్టు ఆదేశాలకు భయపడి మాటమార్చిన విధానాన్ని ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ప్రశ్నిస్తే దాడికి పాల్పడడం ఎంత వరకు సమంజసమన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు పాడి కౌషిక్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేసి, అరికెపూడి గాంధీని మాత్రం ఎస్కార్ట్‌తో కౌషిక్‌రెడ్డి ఇంటికి తీసుకువచ్చారన్నారు. పోలీసులు దగ్గరుండి మరీ దాడులు చేయిస్తున్నారంటే పోలీసు వ్యవస్థ ఎక్కడికి దిగజారిపోతుందని వాపోయారు. అరికెపూడి గాంధీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ అక్కున చేర్చుకుని అవకాశమిస్తే కాంగ్రెస్‌లో చేరి డ్రామాలాడుతున్నాడని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణవాదులు తలచుకుంటే అరికెపూడి గాంధీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఎమ్మె ల్యే గాంధీకి ఏమైనా నైతిక విలువలు ఉంటే ముందు బీఆర్ఎస్ తరఫున గెలిచిన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతోపాటు ఆయన అనుచరులపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని లేనిపక్షంలో పోలీసుల వ్యవహార శైలిపై న్యాయపరంగా ముందుకుపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు ఎం.ఏ.నజీబ్, ముజామ్మిల్, విఠల్‌రావు, పండరి తదితర నాయకులు పాల్గొన్నారు.