అందోల్, ఫిబ్రవరి 17 : అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం అందోల్‌లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని గుర్తుచేశారు.
కేసీఆర్ సీఎంగా లేని తెలంగాణను చూడలేకపోతున్నామని, ప్రజలు ఎంతో ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రతిపక్ష పాత్రను సైతం మరింత బాధ్యతగా నిర్వర్తిస్తామని, ప్రజల పక్షాన మరింత గట్టిగా గొంతుకను వినిపిస్తామన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నదని, తమకు కేసులు కొత్తమీకాదన్నారు.
ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ అలుపెరుగకుండా పోరాడుతామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఎంపీపీ బాలయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.