అందోల్, మే 16: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని, రేవంత్ సర్కారుకు రైతుల ఉసురు తప్పక తగులుతుందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం జోగిపేటలోని హన్మాన్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే తెలంగాణను దుర్భిక్షంగా మార్చిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టంచి పండించిన ధాన్యాన్ని సైతం కొనలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.
రైతులు రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితి వచ్చిందన్నారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటే సహించమని, రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే కాంగ్రెస్ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని, మీకు అండగా బీఆర్ఎస్ ఎప్పు డూ ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ మెడ లు వంచి హామీలు అమలయ్యేలా కృషిచేస్తామని క్రాంతికిరణ్ అన్నారు. ఆందోళనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు శ్రీధర్, మాజీఎంపీపీ రామాగౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగభూషణం, నాయకులు వీరప్ప, విజయ్‌కుమార్, శివకుమార్, విఠల్, బుచ్చయ్య, సంతోష్, లింగాగౌడ్, వెంకటేశం, సాయికుమార్, రమేశ్, మొగులయ్య, శంకరయ్య, శ్రీనివాస్, విజయ్‌కుమార్, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.