చౌటకూర్, మే 28: అకాల వర్షాలు కురుస్తాయని సమాచారం ఉన్నప్పటికీ, యాసంగి ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేటలో అకాల వర్షానికి తడిసిన వడ్లను బీఆర్ఎస్ నేత పట్లోళ్ల జైపాల్‌రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. పంటల సాగుపై అధికార యం త్రాంగం వద్ద స్పష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.
వరి కోతలు కోసి నెల రోజులవుతున్నప్పటికీ, తూకం వేయ డం, రైస్ మిల్లులకు తరలించడంలో నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించారని ధ్వజమెత్తారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, రవాణా శాఖల మధ్య సమన్వయం కొరవడడంతోనే ధాన్యం తడిసి ముద్దయిందని విచారం వ్యక్తం చేశారు. రోజుల తరబడి ధాన్యం అరబెట్టి, కాపల ఉంటున్న రైతులు అకాల మరణం చెందుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని ఆరోపించారు.
రోడ్లపై కల్లాల్లో ఎకడ చూసినా వరి ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయని తెలిపారు. కోర్పోలులో వంద లారీల ధాన్యం పండితే, ఇప్పటి వరకు 30 లారీల ధాన్యాన్ని మాత్రమే రైస్ మిల్లులకు తరలించారని క్రాంతికిరణ్ అన్నారు. గ్రామం లో ఎకడ చూసినా ఆరబెట్టి వడ్ల కుప్పలే కనిపిస్తున్నాయ తెలిపారు. అందోలు అసెంబ్లీ నియోజకర్గంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నదని, మంత్రి దామోదర రాజనరసింహ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండు రోజుల్లోగా ధాన్యం సేకరణ పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు కంపల్లి శివకుమార్, నాయకులు దర్శన్‌రెడ్డి, మిరియాల రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లేశం, అనిల్‌రెడ్డి, దేవయ్య, అశోక్, రాంరెడ్డి ఉన్నారు.