అందోల్, జనవరి 8 : హామీలు అమలులో, ప్రజా పాలన చేయడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలం చెందిందని సంగారెడ్డి జిల్లా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. రైతుబంధు రూ. 15వేలు చెల్లించాలని, కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్ట డం మానుకోవాలని, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జోగిపేటలో బీఆర్ఎస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నోటికి నల్లగుడ్డలు కట్టుకుని మౌనదీక్ష, నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందన్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయ డం లేదన్నారు.
ప్రజల పక్షా న బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ప్రభు త్వం జీర్ణించుకోలేక అక్రమ కేసులు పెడుతున్నదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి నియంత పాలనను ఎక్కువ కాలం సాగదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్ట డం జైలుకు పంపి కక్ష సాధించడం చేస్తున్నదని, అందులో భాగంగానే కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని అందోల్ నియోజకవర్గం లో సైతం అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
రాజ్యాంగం ప్రజలకిచ్చిన అధికారాలను సైతం ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నదని, ఎన్నికల సమయంలో రాజ్యాం గం పుస్తకాలు చేతులో పట్టుకుని మరీ తిరిగిన కాం గ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే వరకు కాం గ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తేలేదన్నారు.
కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మౌన ప్రదర్శన, నిరసన దీక్షకు పార్టీ శ్రేణులు, రైతులు తరలిరావడంతో జోగిపేటలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాలయ్య, మాజీ జడ్పీటీసీ రమేశ్, నాయకులు లింగాగౌడ్, నారాయణ, నాగభూష ణం, వీరారెడ్డి, విఠల్, వెంకటేశం, అశోక్‌గౌడ్, బుద్దిరెడ్డి, బస్వరాజ్, శివాజీ, శంకర్, విజయ్, శశికుమార్, నాగరాజు, రమేశ్, కృష్ణాగౌడ్, సయ్యద్, ప్రవీణ్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, మొగులయ్య, రాజు, మండలాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.