సిర్గాపూర్, నవంబర్ 2 : వానకాలం వడ్లు కల్లాల్లోనే అకాల వర్షానికి తడిచి ముద్దవుతున్నా ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు కొనుగోలు చేయడం లేదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి విమర్శించారు. శనివారం సిర్గాపూర్ మండల కేంద్రం పరిసర ప్రాంతాల్లో రోడ్డుపై ఆరబెట్టిన వడ్లను చూసి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ ఎంపీటీసీలు సం జీవరావు, శాంతాబాయితో కలిసి మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే ప్రతి గ్రామానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారే తప్పా…ఇప్పటికీ రైతు నుంచి ఒక్క క్వింటాల్ వడ్లు కొనలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్నివిధాలా మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని విస్మరించారన్నారు. వడ్ల కొనుగోలు చేతకాకపోతే వెం టనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశా రు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి పెద్ద తప్పు చేశామని రైతులు, ప్రజలు వాపోతున్నారని చెప్పారు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని, బోనస్ ఇవ్వాలని, లేకపోతే ప్రజల చేతిలో కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సంజీవరావు, రైతులు శాం తాబాయి తదితరులు ఉన్నారు.