సిద్దిపేట, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగిరం చేయకుంటే వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని సిద్దిపేట జిల్లా అధికార యంత్రాంగానికి , ప్రభుత్వానికి హరీశ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్షలాది మంది రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రోహిణి కార్తె వచ్చినా మూడొంతుల వడ్లు కొనుగోళ్లు పూర్తి చేయలేదన్నారు. రైతులు మకలు అమ్మి రెండు నెలలైనా ఇంతవరకు రూపాయి రాలేదన్నారు.
మకలు, సన్ ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా తానే వేలాది మంది రైతులను వెంటబెట్టుకుని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తానని తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతుల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా రైతులకు ఇంత బాధ, కష్టం ఎన్నడూ రాలేదన్నారు.
కేంద్రం వడ్లు కొనకపోతే ఆనాడు కేసీఆర్ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి, కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసినట్లు గుర్తుచేశారు. సిద్దిపేట నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, ఖాతా, వెంకటాపూర్, నర్మెట, పాలమాకుల, సిద్దిపేట అర్బన్, ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి, రావురూక్ల, రాఘవాపూర్, మల్లారం, సికింద్లాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు తనకు ఉదయం నుంచి ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. మిల్లుల్లో బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రైతులు డీఎస్వో దృష్టికి తీసుకెళ్తే, మీరే మిల్లర్లతోనే మాట్లాడుకోవాలని డీఎస్వో అనడం తగదన్నారు.
మంత్రి కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు…
ధాన్యం కొనుగోళ్లలో ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా, ఏ ఒక మంత్రి కొనుగోలు కేంద్రానికి రావడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. రైతులు మిట్టపల్లి, నంగనూరు, చిన్నకోడూరులో నిత్యం రైతులు రాస్తారోకోలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. రోహిణి కార్తె వచ్చినా కొనుగోళ్లు కాక వడ్లు కల్లాల్లోనే ముగ్గుతున్నాయని అన్నారు. ఇటీవల మెదక్ జిల్లా కొల్చారంలో వడ్ల కుప్పల మీదనే రైతు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10-12 మంది రైతులు కల్లాల్లో ప్రాణాలు విడిచారన్నారు.
మార్చి 22న సిద్దిపేట గడ్డ మీద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చి 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా వేస్తామని సీఎం చెప్పాడని, ఇవాళ్టికి 63 రోజులైనా రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా రాలేదన్నారు.ఎన్సాన్పల్లి కేంద్రంలో నెలన్నర రోజుల్లో కేవలం ఆరు లారీలు మాత్రమే వచ్చాయని, వానలకు వడ్లు తడిసి, కింద సీసీ లేక మట్టిలో కలిసిపోయి చెదలు పడుతున్నాయని తెలిపారు. లారీలు, బస్తాలు పంపాలని రైతులు మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, నాయకులు రాజనర్సు, రవీందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, ప్రశాంత్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రైతుల సమస్యలు మీకు పట్టవా..

లారీలు రావడం లేదని, తరుగు పేరిట తూకం వేస్తున్నారని, రోజుల తరబడి కాంటా కావడం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుంటే అధికారులు పట్టించుకోక పోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఉదయం సిద్దిపేట క్యాంపు కార్యాలయం నుంచి హరీశ్‌రావు సిద్దిపేట ఆర్డీవో సదానందంతో ఫోన్లో మాట్లాడారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డీవోకు సూచించారు.
మిట్టపల్లి , నంగునూరు గ్రామాల్లో రైతులు రాస్తారోకో చేస్తున్నారని తెలిపారు. నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలకు సంబంధించి దాదాపు 18 గ్రామాల రైతులు ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై తనకు ఫోన్ చేసి బాధపడ్డారని ఆర్డీవో దృష్టికి హరీశ్‌రావు తీసుకెళ్లారు. రైతులు ఎవరికి ఫోన్ చేసినా స్పందించడం లేదని, అకాల వర్షాలు కురిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు రైతుల బాధలు వర్ణనాతీతంగా మారడంతో సింగిల్ విండో సొసైటీల చైర్మన్లు తన వద్దకు వచ్చారని, సమస్యలు తీవ్రం కావడంతో వారు కూడా చేసేదేమీ లేక వారి బాధలు తనతో మొరపెట్టుకున్నారని ఆర్డీవోకు వివరించారు.
43 కిలోల తూకం వేస్తున్నారని డీఎస్వో దృష్టికి తీసుకెళ్తే, రైతులని మిల్లర్లతో మాట్లాడుకోవాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఒక అధికారిగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. ఏఏ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో, ఆ గ్రామాల జాబితాను ఆర్డీవోకు తెలిపారు. మళ్లీ సమస్యలు ఉత్పన్నం కాకుండా పర్యవేక్షించాలని సూచించారు. సొసైటీ చైర్మన్లు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మీరే ముందుండి రైతులకు ఇబ్బందులు లేకుండా, అధికారులతో ఎప్పటి కప్పడు సమన్వయం చేసుకుంటూ ధాన్యం త్వరితగతిన పంపేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. సమావేశంలో సొసైటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, కనకరాజు, మహిపాల్‌రెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.