గజ్వేల్, డిసెంబర్ 2: గురుకుల పాఠశాలలు అద్దె భవనాలు.. అరకొర వసతులతో కొనసాగుతున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ గురుకుల బాటలో భాగంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని బాలుర గురుకుల పాఠశాల, కళాశాల, మైనార్టీ పాఠశాల, కేజీబీవీని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలు చేసేందుకు, లబ్ధి పొందేందుకు గురుకులాల బాట పట్టలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్రంలోని గురుకులాల పరిస్థితి ఆధ్వానంగా ఉందన్నారు. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో సరైన పౌష్టికాహారం అందక, అద్దె భవనాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
విద్యార్థుల మృతికి కారణమైన సీఎం రేవంత్‌రెడ్డి నైతికబాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాలనను గాలికి వదిలేసి విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలు యాదవ్, జంగిటి కమలాకర్, పరశురాములు, బీఆర్ఎస్ అధ్యక్షుడు నవాజ్‌మీరా, కుమార్, నాయకులు రమేశ్‌గౌడ్, నిజాం, ప్రవీణ్, నవాజ్, మోహన్‌బాబు, కనకరాజు, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.