గుమ్మడిదల, ఫిబ్రవరి 2: బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి హరితహారం కార్యక్రమం చేపట్టి కోట్లాది మొక్కలు నాటించారు. రాష్ట్రంలో అటవీ ప్రాంతాలను అర్బన్ పార్కులుగా తీర్చిదిద్దడానికి శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్ అటవీప్రాంతంలో అర్బన్ పార్కును ఏర్పాటు చేసి ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి అటవీ ప్రాంతంలో సైతం అర్బన్ పార్కును కేసీఆర్ ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌లోని అర్బన్ పార్కు అందుబాటులోకి తేవడంతో ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు.
బొంతపల్లి అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కును 690 హెక్టార్లలో సుందరంగా తీర్చిదిద్దారు. ముఖద్వారం, వాచ్‌టవర్, అడవి చుట్టూ ఫెన్సింగ్, రోడ్లు, విశ్రాంతి తీసుకోవడానికి గజీబో, రోడ్డుకు ఇరువైపులా అందమైన మొక్కలు నాటారు. దాదాపు 95శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత బొంతపల్లి అర్బన్ పార్కు ప్రారంభాన్ని విస్మరించింది. చిన్నపాటి పనులు పూర్తిచేస్తే అందుబాటులోకి తేవచ్చు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా బొంతపల్లి అర్బన్ పార్కు ప్రారంభానికి నోచుకోకపోవడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు నిరాశ చెందుతున్నారు.
బొంతపల్లిలో అర్బన్ పార్కుకు సమీపంలో సుప్రసిద్ధ శైవక్షేత్రం బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం ఉన్నాయి. వీటికి ప్రతి ఆది, సోమవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉండడంతో అధిక సంఖ్యలో సందర్శిస్తున్నారు. వచ్చిన భక్తులు, పర్యావరణ ప్రేమికులు అర్బన్ పార్కులో సేద తీరడానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బొంతపల్లి అర్బన్ పార్కును ప్రారంభించాలని అందరూ కోరుతున్నారు.
బొంతపల్లి అర్బన్ పార్కును త్వరలోనే అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తాం. ఇటీవల ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ గంగాభవానీతో కలిసి పార్కును సందర్శించా. అర్బన్ పార్కు చివరి దశలో ఉంది. అటవీశాఖ అధికారులతో మాట్లాడి అర్బన్ పార్కుపై ఆరాతీశా. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించా. అర్బన్ పార్కు అందుబాటులోకి వస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని త్వరలో ప్రజలకు, పర్యావరణ ప్రేమికులకు, పర్యాటకులకు అందుబాటులోకి తెస్తాం.
– వల్లూరు క్రాంతి, సంగారెడ్డి కలెక్టర్