కల్లుగీత కార్మికులకు రూ. ఐదు లక్షల బీమా ప్రకటనపై గౌడన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. చిలిపిచెడ్ మండలం చిట్కుల్లో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గౌడ సంఘం సభ్యులు.
చేర్యాల, మే 3: నిత్యం ప్రమాదం అంచున వృత్తిని నిర్వహిస్తున్న గీత కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుల వృత్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేశంలోని ఇతర రాష్ట్రలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల బీమా అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ప్రకటించారు. దీంతో కల్లుగీత కార్మిక కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు అమలు చేస్తున్న రైతు బీమా విధంగా నిత్యం ప్రమాదం అంచున జీవనం సాగించే గీతన్నకు బీమా పథకం అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గీత కార్మికుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు రూపొందించి వాటిని అమలు చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్ నగరంలో ఐదు ఎకరాల స్థలం కేటాయింపుతో పాటు రూ.5కోట్లతో గౌడ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తాటి, ఈత చెట్లకు గీత కార్మికులు చెల్లిస్తున్న చెట్టు పన్ను(రకం), బకాయిలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సొసైటీల రెన్యువల్స్ ఐదేండ్ల గడువు నుంచి 10 ఏండ్లకు పెంచారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆరు వేల సొసైటీలు, 1892 టీఎఫ్టీలలోని 9,200 మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు వెంటనే విధి విధానాలు రూపొందించి వాటిని త్వరలో అమలు చేసే బాధ్యతలను సీఎం కేసీఆర్ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పగించారు.
గీతన్న జీవితాల్లో వెలుగులు నింపేందుకు..
గీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా గతంలో ఉన్న గీత కార్మికుల పింఛన్ రూ.200 నుంచి రూ. 2000లకు పెంచడంతో పాటు 60 ఏండ్ల వయసును 50 సంవత్సరాలకు తగ్గించడంతో ఎంతో మంది కార్మికులకు ప్రయోజనం కలిగింది. గౌడ వృత్తిని ప్రోత్సహించేందుకు కార్మికులకు ప్రమాద బీమా పరిహారం రూ.2 నుంచి రూ. 5లక్షలకు పెంచింది. గ్రామంలోని గీత వృత్తి చేసుకునే గౌడ కులస్తులకు ఆసరాగా ఉండేందుకు సొసైటీ రెన్యువల్ కాలాన్ని 10 ఏండ్లు పెంచింది. కల్లుగీత వృత్తి నిర్వహించి సొంతంగా వ్యాపారం చేసే కార్మికులకు టీఎఫ్టీ విధానం అమలు చేస్తున్నది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో చెరువు గట్టు, ప్రభుత్వ భూములు, గుట్టలు, బీడు భూములు, పొలం గట్లపై ఈత, తాటి మొక్కలు నాటించింది. గీత వృత్తి పై ఆధారపడే కుటుంబాలకు తాటి, ఈత వనాలు పెంచేందుకు సంబంధితశాఖ ద్వారా జిల్లాలో మూడున్నర లక్షలకు పైగా మొక్కలు నాటించారు.
బీమా..ధీమా
తాటి వనాల్లో కల్లుగీత వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి పడి గాయాలపాలవడం, మృతి చెందిన కార్మికులకు బీమా పరిహారాన్ని ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా భారీగా పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. తాజాగా కల్లుగీత వృత్తిదారుడికి భరోసా కల్పిస్తూ సీఎం కేసీఆర్ రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడంతో గీత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం తరపున ఎక్స్‌గ్రేషియా అందుతున్నది. కొన్ని నిబంధనలకు తోడు కార్మికుడు మరణించడం లేదా గాయాలపాలవడంతో అవసరమైన కాగితాలు తీసుకువచ్చి ఫైలు తయారు చేసి ఎక్సైజ్‌శాఖ అందించే ప్రక్రియ తదితర టెక్నికల్ కారణాల వల్ల ఎక్స్‌గ్రేషియా అందడంలో ఆలస్యమవుతున్నది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి రైతు బీమా తరహాలో వారం రోజుల్లోనే పరిహారం బాధితుడి నామినీ అకౌంట్లో జమయ్యే విధం గా కార్యాచరణ రూపొందించింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ప్రమాదానికి గురైన, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడి శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికుడికి రూ.50వేలు, తీవ్రంగా గాయపడిన కార్మికుడికి రూ.10వేలు చెల్లించే వారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సర్కార్ మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.5లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన కార్మికుడికి రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన కార్మికుడికి రూ.50వేల చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
తీరనున్న గౌడన్నల కష్టాలు
రోజురోజుకూ అంతరించిపోతున్న గీత వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే అమలు చేస్తున్న పన్ను రద్దు, సొసైటీల రెన్యువల్ గడువు పెంపు గీత వృత్తిని ప్రోత్సహిస్తున్నది. గీత కార్మికుల బీమా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకోవడంతో గౌడన్నల కుటుంబాల కష్టాలు తీరనున్నాయి. కల్లుగీత కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సైతం అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకువచ్చారు. గీత కార్మికుల ప్రమాద బీమా పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచిన ప్రభుత్వం, తాజాగా గీత బీమా కల్పించడం చరిత్రలో నిలిచిపోతుంది. రాష్ట్రంలోని గీత కార్మికులను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు గౌడ బిడ్డలు రుణపడి ఉంటారు. గత పాలకులు గౌడ వృత్తిని నిర్లక్ష్యం చేశారు కానీ సీఎం కేసీఆర్ వృత్తిని ప్రోత్సహించేందుకు పింఛన్ పెంపు, చెట్ల పన్ను రద్దు, పరిహారం పెంపు తదితర నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రైతు బీమా తరహాలో గీత కార్మికులకు బీమా అమలు చేయడం అభినందనీయం.
-సుంకరి మల్లేశంగౌడ్, ఏఎంసీ చైర్మన్, చేర్యాల
సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు
గతంలో చెట్టుమీద నుంచి పడితే వందలో ఒకరికి మాత్రమే నామమాత్రంగా సాయం అందేది. అది కూడా పైరవీలు చేసేవాళ్లకు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో ఎలాంటి పైరవీలు లేకుండా లైసెన్స్, ఐడీకార్డులు ఇవ్వడంతో పాటు 50 ఏండ్లు నిండిన గీత కార్మికులకు నెల నెలా రూ.2వేల పింఛన్ ఇస్తున్నారు. గిప్పుడు చెట్టు మీద నుంచి పడి మృతిచెందిన వారికి ఎలాంటి పైరవీలు లేకుండా రైతు బీమా లెక్క వారి అకౌంట్లో రూ.5లక్షలు జమ చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గీత కార్మికుల కుటుంబాల తరపున సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు. – దొడ్లె స్వామిగౌడ్, కొమురవెల్లి