నర్సాపూర్, ఏప్రిల్ 8 : మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణం హైదరాబాద్ మహానగరానికి అతి సమీపంలో ఉండడంతో దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణం వేగంగా విస్తరిస్తున్నది. అంతేస్థాయిలో ట్రాఫిక్ కష్టాలు పెరుగుతున్నాయి. పట్టణంలో ఉదయం, సాయంత్రం సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటున్నది. ప్రధాన రోడ్డు పక్కన వాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
రోడ్డు పక్కనే ఉన్న పాదచారుల బాటలు ఆక్రమించి చిరువ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో రహదారి కుచించుకుపోయి వాహన రాకపోకలకు ఆటంకం కలుగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ట్రక్కులు రోడ్డుపైనే నిలిపి సరుకులు, ఇండ్లకు ఉపయోగించే సిమెంట్, స్టీల్, ఇతర వాటిని గంటల తరబడి దించుకోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతున్నదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
నిత్యం ట్రాఫిక్ కష్టాలు…
నర్సాపూర్ పట్టణంలో 25వేల జనాభా ఉంది. 15 వార్డులు ఉన్నాయి. పట్టణంలోని బస్టాండ్, చౌరస్తా వద్ద ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ చౌరస్తా నుంచి మెదక్, సంగారెడ్డి, తూప్రాన్, హైదరాబాద్ వైపు రాకపోకలు సాగుతుంటాయి. ప్రతిగంటకు వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఈ చౌరస్తాలోనే రద్దీతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇక్కడ వాహనాలకు ఆటంకం ఏర్పడుతున్నది. ఇక్కడ రోడ్లను ఆక్రమించి పుట్‌పాత్‌లపైనే చిరు వ్యాపారాలు సాగుతున్నాయి. కొనుగోలు చేయడానికి వచ్చిన వారు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
చలాన్లకే ట్రాఫిక్ పోలీసులు పరిమితం
ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు చలాన్లకే పరిమితం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా రాంగ్రూట్లో వచ్చినా, హెల్మెట్ లేకపోయినా, నో పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపినా ఫొటోలు తీసి కేవలం చలాన్లు విధించడానికే పోలీసులు పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పాదచారుల సేఫ్టీ కోసం ఫుట్‌పాత్‌లను నిర్మించి, వాటికి రక్షణగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. కానీ, కొంతమంది వ్యాపారులు వాటిని తొలిగించి అక్కడే యథేచ్చగా వ్యాపారాలు సాగిస్తున్నారు. అధికారులు స్పందించి ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యా పారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.