మెదక్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగకు ప్రజలు సొంత ఊర్లకు వెళ్తారు. పిల్లలకు సెలవులు ఉండడంతో చాలామంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి.బాలస్వామి సూచించారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా దొంగతనాల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ఈ విషయంలో మెదక్ జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.
దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారులకు తెలపాలి. పోలీసులు మీ వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుని ఊర్లెళ్లినవారి ఇండ్లపై నిఘా ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రజలు కాలనీలు, ఇండ్లు, పరిసరాలు, షాపింగ్ మాల్స్‌లో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. – ఊరు వెళ్తున్నప్పుడు పకింటివారికి తమ ఇంటి పరిసరాలను గమనించాలని కోరాలని సూచించారు. విలువైన వస్తువులను ఇంటిలో పెట్టరాదు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఇంట్లోని బంగారు నగలు, నగదు ఉంటే, వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ఎకువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభమని ఎస్పీ బాలస్వామి తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ బాలస్వామి సూచించారు.