జహీరాబాద్, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జహీరాబాద్ పట్టణంలో భారీ వర్షం పడింది. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మండలంలోని కోత్తూర్(బి) శివారులోని నారింజవాగు ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో సోమవారం మధ్యాహ్నం వరకు నాలుగు ఇంచుల మేర గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.
మండలంలోని బూచినెల్లి- కర్ణాటకలోని ఘనపూర్‌కు వెళ్లే మార్గంలోని కల్వర్టుపై నుంచి నీరు ఉధృతంగా ప్రహిస్తోంది. మండల రెవెన్యూ, చిరాగ్పల్లి పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కల్వర్టు మీదుగా వెళ్లే మార్గంలో అడ్డంగా ముళ్లపొదలు ఏర్పాటు చేశారు. న్యాల్కల్ మండలంలోని హద్నూర్, డప్పూర్, శంశోల్లాపూర్, చినిగేపల్లి గ్రామాల్లోని వాగులు, కుంటలు, చెరువులతో పాటు మంజీరానదిలోకి నీరు భారీగా చేరుతున్నది. ఆయా గ్రామాల మీదుగా సాగించే రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు
గురయ్యారు.
ఝరాసంగం, ఆగస్టు 11: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, చెరువుల్లోకి నీరు చేరింది. ప్యాలవరం, జీర్లపల్లి, బోరేగావ్, కృష్ణాపూర్, బిడేకన్నె, ఏడాకులపల్లి గ్రామాల శివారులోని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్యాలవరం వాగు వద్ద ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ బారికేడ్లు ఏర్పాటు చేశారు.ఆయా గ్రామాల్లో పత్తి, సోయా, మక్క, కంది పంటలు నీటిలో మునిగాయి.