చేర్యాల, అక్టోబర్ 2 : కొన్ని రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో కురిసిన వర్షంతో ఒకింత చల్లబడ్డారు. ఉదయం నుంచి నిప్పులు కక్కుతున్న సూర్యభాగవానుడు చల్లబడడంతో మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బలు ఏర్పడి గంటపాటు చేర్యాల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.
చేర్యాల పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వర్షం పడటంతో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు అవాంతరం ఏర్పడింది. పట్టణంలోని వివిధ కాలనీల్లో బతుకమ్మ ఆడుకునేందుకు ఉదయాన్నే స్థలాన్ని చదును చేయించి మ్యాట్స్ వేశారు. ఒక్కసారిగా వర్షం పడటంతో మ్యాట్ తడిచి మహిళలు ఒకింత అసహనానికి గురయ్యారు. ఇది ఇలా ఉండగా చేర్యాల అంగడి బజారు, గాంధీ సెంటర్ తదితర ప్రాంతాల్లో వరద చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
హుస్నాబాద్, అక్టోబర్ 2: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం సుమారు గంట పాటు వర్షం వచ్చింది. ఇదే సమయంలో ప్రారంభమయ్యే ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది.
అనంతరం వర్షం కొంత తగ్గినప్పటికీ బతుకమ్మ వేడుకలు అంతంతమాత్రంగానే జరిగాయి. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని మెయిన్‌రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా మొత్తం చిన్నపాటి వాగును తలపించాయి. గడిచిన నాలుగు రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం భారీ వర్షంతో కొంత సేదతీరినట్లయింది.
సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 2: సంగారెడ్డిలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డిలో 107.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సరాసరి వర్షపాతం 15.1 మిల్లీ మీటర్లుగా నమోదైంది. మొగుడంపల్లిలో 98.1 మి.మీ, హత్నూరలో 61.7మి.మీ, జహీరాబాద్‌లో 31.4మి.మీటర్ల భారీ వర్షం కురవగా, పటాన్చెరు, కంది, గుమ్మడిదల, కోహీర్, మునిపల్లి, న్యాల్కల్, చౌటకూర్, పుల్కల్ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది, మరి కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు పడ్డాయి.
భారీ వర్షాలకు అన్నదాత కుదేలవుతున్నాడు. వర్షాలు తగ్గాయనుకుంటున్న సమయంలో మరోసారి భారీ వర్షాలు పడటంతో పత్తి రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే నెల రోజుల్లో చేసిన నష్టం అంతా ఇంతా కాదని, అధికారులు తిరిగి చూడడం లేదని పత్తి రైతులు వాపోతున్నారు. మరోసారి భారీ వర్షం తమకు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నదని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి పంటలు పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.