సంగారెడ్డి, సెప్టెంబర్ 8: సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి పడిన భారీ వర్షానికి 4వ వార్డు శివాజీనగర్‌లో పలు ఇండ్లల్లోకి వరద వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా రాత్రి సమయంలో వర్షం పడటంతో ఇండ్ల ముందు వరద ప్రవాహానికి ప్రజలు బెంబేలెత్తారు.
అధికారులు, మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సమాచారం ఇచ్చారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణమంతా అతలాకుతలమైంది. రెవెన్యూ కాలనీ కింది భాగంలో సర్వే ల్యాండ్ కాలనీలు, ఎర్రకుంటలో నిర్మించిన పలు కాలనీలు నీట మునిగాయి.
చెరువులను ఆక్రమించి ఇండ్లు నిర్మించడంతోనే నీటిలో మునిగినట్లు పలువురు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. జలవనరులను కాపాడేందుకు నిర్మించిన చెరువులు, కుంటలను రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధనదాహానికి పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి.
ఇందిరాకాలనీలోని డ్రైవర్స్ కాలనీ పక్కన ఉన్న ఎర్రకుంట చెరువులో కట్టుకున్న ఇండ్లు నీటిలో మునిగాయి. చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా కొంతమంది రియల్ వ్యాపారులు తమ స్వార్థంతో ప్లాట్లు చేసి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నా రు. అధికారుల అనుమతులు లేకుండా భవంతుల్లో సెల్లార్లు నిర్మించడంతో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.