సంగారెడ్డి, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్‌లు) పదవీకాలం పొడిగింపు విషయంలో అధికార కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్యాక్స్ చైర్మన్లు, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సొసైటీ చైర్మన్ల పదవీకాలం మాత్రమే పొడిగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు చెందిన బాచేపల్లి, కృష్ణాపూర్, గంగాపూర్, కల్హేర్, ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలం పొడిగించకుండా అడ్డుకుంటున్నది. ఆగస్టులోనే ఈ నలుగురు చైర్మన్ల పదవీకాలం పొడిగించాల్సి ఉంది.
కానీ, రాజకీయ ఒత్తిళ్లతో సహకార అధికారులు పదవీకాలం పొడిగించడం లేదు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌కు చెందిన ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలం పొడిగించిన అధికారులు, బీఆర్ఎస్కు చెందిన నలుగురు చైర్మన్ల పదవీకాలం మాత్రం పొడిగించలేదు. వీరి పొడిగింపు వద్దని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డీసీవోకు లేఖ రాసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు డీసీవో ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయకపోగా, చైర్మన్ల స్థానంలో పర్సన్ ఇన్చార్జిలను నియమించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 53 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్)లు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో 13 ఫిబ్రవరి, 2020లో పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగాయి. 53 పీఏసీఎస్‌లకు చైర్మన్లు, డైరెక్టర్లను ఎన్నుకున్నారు. బీఆర్ఎస్కు చెందిన ప్యాక్స్ చైర్మన్లు తమ పరిధిలోని పీఏసీఎస్‌లలో రుణాల పంపిణీ, ఇతర కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరితో ప్యాక్స్ చైర్మన్ల పదవీకాలం ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకపోగా, పీఏసీఎస్ చైర్మన్ల పదవీకాలం ఆరునెలలు పొడిగించింది. ఆగస్టులో పదవీకాలం ముగియడంతో మరోసారి చైర్మన్ల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెజార్టీ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండటంతో కాంగ్రెస్ సర్కార్ చిన్న మెలిక పెట్టింది. పీఏసీఎస్ సొసైటీల నష్టాలకు పాలకవర్గం కారణమైనా లేదా నిధులు దుర్వినియోగం జరిగినా అలాంటి పాలకవర్గాలకు పదవీకాలం పొడిగించవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈఏడాది ఆగస్టు 14న డీసీవో సంగారెడ్డి జిల్లాలోని 49 మంది ప్యాక్స్ చైర్మన్ల పదవీ కాలాన్ని పొడిగించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన బాచేపల్లి, కృష్ణాపూర్, గంగాపూర్, కల్హేర్, మార్డి పీఏసీఎస్ చైర్మన్ల పదవీకాలం పొడిగించలేదు. బాచేపల్లి, కృష్ణాపూర్, గంగాపూర్, కల్హేర్ ప్యాక్స్ చైర్మన్లు బీఆర్ఎస్లో చురుగ్గా ఉంటారు. ఈ కారణంగానే ఎమ్మెల్యే పట్టుబట్టి మరీ నలుగురు పీఏసీఎస్ చైర్మన్ల పదవీకాలం పొడిగించకుండా స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నట్లు తెలుస్తుంది. వీరి పదవీకాలం పొడిగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఎమ్మెల్యే డీసీవోపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చి పొడిగింపు అడ్డుకోవడంతో పాటు చైర్మన్ల స్థానంలో పర్సన్ ఇన్చార్జిల నియామకానికి పట్టుబట్టినట్లు సమాచారం. నలుగురు చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ మారాలని ఎమ్మెల్యే వర్గం ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రెండు, జహీరాబాద్ నియోజకవర్గంలోని మూడు సొసైటీలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్లు ఉన్నారు. ఈ ఐదు సొసైటీలపైనా నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉన్నాయి.
అయినా అధికారులు ఐదు సొసైటీల చైర్మన్ల పదవీకాలం పొడిగించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ చైర్మన్లు ఉన్న ఐదు సొసైటీలకు చైర్మన్ పదవులను డీసీవో పొడిగించక పోవడం వెనక మర్మం ఏమిటో తెలియడం లేదు. ఇటీవల డీసీవో నియమించిన పర్సన్ ఇన్చార్జిలపైనా అప్పుడే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు సొసైటీల్లో పర్సన్ ఇన్చార్జిలు రైతులకు రుణాల మంజూరులో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ల మేరకు తమకు పదవీకాలం పొడిగించడం లేదని బాచేపల్లి, కృష్ణాపూర్ సొసైటీ చైర్మన్లు సంగారెడ్డి, కృష్ణగౌడ్ ఆరోపించారు.
తమ సొసైటీల్లో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపిస్తూ చైర్మన్ పదవుల పొడిగింపును అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి చైర్మన్లుగా ఎన్నికైన తమపై రాజకీయ కక్షతోనే పదవీకాలం పొడిగించడం లేదని ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులను డీసీవో అమలు చేయడం లేదన్నారు. డీసీవో కోర్టు ఉత్తర్వుల మేరకు పదవీకాలం పొడిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, పర్సన్ ఇన్చార్జిల నియామకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారితే పదవీకాలం పొడిగిస్తామని తమపై ఒత్తిడి తీసుకువస్తున్నా, తాము తలొగ్గమని పదవీకాలం పొడిగింపుపై పోరాటం చేపడతామని వారు హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లాలో 53 పీఏసీఎస్‌లకు బాచేపల్లి, కృష్ణాపూర్, గంగాపూర్, కల్హేర్, మార్డి చైర్మన్ల పదవీకాలం పొడిగించలేదు. ఈ ఐదు సొసైటీల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఉండడంతో పదవీకాలం పొడిగించకుండా పర్సన్ ఇన్చార్జిలను నియమించాం.ఈ సొసైటీల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు నారాయణఖేడ్ ఎమ్మెల్యే లేఖ అందజేశారు. ఐదు సొసైటీల పదవీకాలం పొడిగించాలని కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాం. మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. పర్సన్ ఇన్చార్జిలు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– కిరణ్‌కుమార్, జిల్లా సహకార అధికారి సంగారెడ్డి (డీసీవో)