కోహీర్, మే11: మత్స్యకారుల సంక్షేమానికి గత ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. గత సీఎం కేసీఆర్ హయాంలో మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను నిర్వహించింది. మత్స్యకారుల సంఘానికి ఉచితంగా చేప పిల్లలను అందించడం, వారికి అవసరమయ్యే సామగ్రిని అందించేందుకు చేయుతనం దించింది. కానీ ప్రభుత్వం మారడంతో మత్స్యకారుల ఆనందం కనుమరుగయ్యింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొటిగార్పల్లి, బడంపేట, పర్సపల్లి గ్రామాల్లోని మత్స్యకారుల సంఘాలకు గతంలో ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశారు.
ఆయా గ్రామాల్లో చెరువుల్లో చేప పిల్లలను విడిచారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని దూరం పెట్టింది. చేప పిల్లల పంపిణీ మాటే ఎత్తడం లేదు. దీంతో ఆయా గ్రామాల్లోని సంఘాల సభ్యులు నిరాశతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. నిరుపేదలమైన తమ సంఘాలకు ఉచితంగా చేప పిల్లలను అందించి ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరారు.