పటాన్చెరు, జూలై 13 : సిగాచి పరిశ్రమ ఘటన మరువక ముందే సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ ఆగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటలో చెలరేగి లారీ, జేసీబీతో పాటు వస్తువులు కాలిపోయాయి. పొగలు చెలరేగడంతో కార్మికులు బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఐదు అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంతో ఫ్యాక్టరీ నుంచి దట్టంగా పొగ వెలువడి చుట్టుపక్కలకు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీపంలోని పరిశ్రమల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం పై విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించక పోవడం, అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలో లోపాలు ఉన్నట్లు గతంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు గుర్తించి, యాజమాన్యానికి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ (ఏపీసీఈ) అమర్చకుండా వ్యర్థ జలాలను శుద్ధి కేంద్రాలకు తరలించరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలిసింది. పీసీబీ కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలు చేసి చర్యలు తీసుకోకపోవడంతో పరిశ్రమల యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.
విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి పరిశ్రమల్లో శాశ్వాత పరిష్కరం చూపాలని ప్రజలు, కార్మికులు కోరుతున్నారు. పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో ప్రమాదం జరిగిన సమయంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు 12 డిసెంబర్ 2024న తనిఖీ చేసి లోపాలు ఉన్నట్లు నివేదిక ఇచ్చినట్లు ఒక ప్రకటన జారీ చేశారు. లోపాలు ఉన్నట్లు అధికారులు తెలిపినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఆదివారం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో ప్రమాదం జరగడంలో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ ప్రమాదం జరిగి కార్మికులు మృతి చెందిన విషయం తేలిసిందే. ఆ సంఘటన మరువకముందే మరో ఘటన పాశమైలారం పారిశ్రామిక వాడలో చోటుచేసుకోవడం అందరినీ కలవరానికి గురిచేసింది.