వర్గల్, ఫిబ్రవరి 23 : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామానికి చెందిన చీగురు స్వరూప తాను నివాసముంటున్న పూరి గుడిసె ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి దగ్ధమైంది. గుడిసెలో ఉన్న బట్టలు, 2 క్వింటాళ్లకు పైగా బియ్యం, బీరువాలో ఉన్న నగదు,నగలు, విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో స్వరూప, తన తల్లి భారతి, కొడుకుతో కలిసి పొరుగూరులో ఉన్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గుడిసె కాలిపోతుందన్న సమాచారం స్వరూపకు చేరవేశారు.
దీంతో ఇంటికొచ్చిన స్వరూపకు కాలిబూడిదైన గుడిసె, బీరువా, బియ్యం సంచులను చూసి కన్నీటి పర్యంతమైంది. నిరుపేద కుటంబానికి చెంది న స్వరూప తన భర్త మరణించడంతో తల్లి భారతితో కలిసి కొన్నేండ్లుగా మజీద్పల్లిలోనే కాయకష్టం చేసకుంటూ తనకొడుకు అభిలాష్తో ఉంటున్నది. ఇప్పుడు తలదాచుకుంటున్న పూరిగుడిసె దగ్ధమవ్వడంతో నిరాశ్రయురాలైంది. దా తలు, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రమాదం పూర్తి విచారణ చేసి స్వరూపకు నష్టపరిహారం అందేలా చర్య లు తీసుకుంటామని వర్గల్ తహసీల్దార్ బాల్రాజ్ మీడియాకు తెలిపారు.